వాతావరణ పరిస్థితుల వల్ల బౌలర్ల ప్రణాళికలపై ప్రభావం పడుతుందని ముంబయి ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంటున్నాడు. యూఏఈలో వేడి కారణంగా చెమటతో యార్కర్లు వేయడం చాలా కష్టమైన పని తెలిపాడు. ఒకపక్క చెమట, మరోవైపు మంచు కురిసే సందర్భంగా వికెట్ పడగొట్టమంటే పిల్లి, ఎలుక ఆటను పోలి ఉంటుందని అన్నాడు.
"వాతావరణం మారుతోంది. యూఏఈలో వేడిమి ఎక్కువ కావడం వల్ల విపరీతమైన చెమట పోస్తుంది. తద్వారా బౌలింగ్ వేయడం చాలా కష్టమవుతుంది. మంచు వల్ల బంతి జారడం కూడా జరుగుతుంది. ఇది చాలా కష్టం. దీని కోసం చాలా ప్రాక్టీసు అవసరం. బౌలింగ్ వేసేప్పుడు ప్రతికూలతలకు మార్గం వెతకాలి. తడి బంతికి మరింతగా సాధన చేయోచ్చు. ఇది కొంచెం కష్టంగా అనిపించినా.. జట్టు కోసం ఉత్తమంగా ఆడాలని ఏ బౌలర్ అయినా అనుకుంటాడు".
- జస్ప్రీత్ బుమ్రా, ముంబయి ఇండియన్స్ బౌలర్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బంతి మెరుపు కోసం లాలాజలాన్ని వాడడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. అయితే ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఈ నిషేధం వల్ల బౌలర్ల అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ, పరిమిత ఓవర్లలో లాలాజల నిషేధమనేది పెద్ద సమస్య కాదని బుమ్రా అభిప్రాయపడుతున్నాడు. కానీ, రెడ్-బాల్ వంటి సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం మెరుపుకోసం లాలాజలం అవసరమని అంటున్నాడు.