దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై తమ సత్తాను చాటుకుంది. 173 లక్ష్యఛేదనతో బరిలో దిగిన చెన్నై సూపర్‌కింగ్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది.
చెన్నై గెలుపులో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ (72) కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో జడేజా (31) ఎప్పటిలాగే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ క్లైమాక్స్‌లో తమకు అనుకూలంగా నిలిచిన గేమ్ ఇదేనని అంటున్నాడు చెన్నై సారథి ధోని. తర్వాతి సీజన్లో అద్భుతంగా రాణించడానికి కావాల్సిన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని ధీమా వ్యక్తం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించాడు
"మ్యాచ్ చివరి దశలో మాకు అనుకూలంగా నిలిచిన గేమ్ ఇదే అనుకుంటున్నాను. ఈ ఘనత జట్టు సభ్యులకే చెందుతుంది. ఈ సీజన్లో జడేజా అద్భుతంగా రాణిస్తున్నాడు. రుతురాజ్ తానేంటో నిరూపించుకున్నాడు. ఒత్తిడి ఉన్నా తట్టుకుని నిలబడ్డాడు. ప్రస్తుతం అత్యంత ప్రతిభ ఉన్న ఆటగాళ్లలో రుతురాజ్ ఒకడు.
టోర్నీలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం చాలా అవసరం. ఉత్తమ ప్రదర్శన కనబర్చడం మాకు అత్యవసరం. మరో దశకు చేరుకునేందుకు మాకు అవకాశం లేదు. కానీ, తర్వాతి సీజన్లో సత్తా చాటగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు."
-- మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.
చిరునవ్వుతో..
మ్యాచ్ గెలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నాడు రుతురాజ్ గైక్వాడ్. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తాను ఆడటానికి పరిస్థితులు క్లిష్టంగానే ఉంటాయని భావించానన్నాడు. తమ సారథి ధోని సూచించినట్లు ప్రతి పరిస్థితిని చిరునవ్వుతో ఎదుర్కొంటున్నానని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తు గురించి అనవసర ఆందోళన చెందనని చెప్పాడు.