యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ పూర్తవ్వగానే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లలో ఇరుజట్లు తలపడనున్నాయి. అయితే ఐపీఎల్ కారణంగా ఇందులో ఆడాల్సిన భారత ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లభించకపోవచ్చు. కానీ, ఆస్ట్రేలియా క్రికెటర్లకు మాత్రం చాలినంత విరామం ఉంది.
వారిద్దరికి తప్ప
ఆసీస్ జట్టులో పద్దెనిమిది మంది ఆటగాళ్లు ఉండగా.. అందులో పది మంది మాత్రమే ఐపీఎల్లో పాల్గొన్నారు. అందులోనూ ఆరుగురు మాత్రమే ప్రస్తుతం ప్లేఆఫ్స్‌లో ఆడుతున్నారు. అయితే ఆసీస్ ఆటగాళ్లైన మార్కస్ స్టోయినిస్(దిల్లీ క్యాపిటల్స్), వార్నర్(సన్‌రైజర్స్ హైదరాబాద్) ఇప్పటివరకు విశ్రాంతి లేకుండా 14 మ్యాచులు ఆడారు. కాబట్టి వీరిద్దరికి విరామం లభించకపోవచ్చు.
ఆర్సీబీ ఆటగాడు ఆరోన్ ఫించ్ ఇప్పటివరకు 11 మ్యాచుల్లోనే పాల్గొన్నాడు. చివరిగా అక్టోబరు 25న ఆడాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడినా ఫించ్‌కు దాదాపు ఈ మధ్యలో 10 రోజుల పాటు విరామం దొరికింది. మరోవైపు అలెక్స్ కేరీ(3 మ్యాచ్‌లు), అడం జంపా(2), డేనియల్ సామ్స్(2) మాత్రమే ఆడారు.