సచిన్ వారసుడు. ఈ తరపు క్రికెట్ దిగ్గజం. పరుగుల యంత్రం. దూకుడైన స్వభావం. ఎక్కడా వెనక్కి తగ్గని నైజం. ఫిట్‌నెస్ ఫ్రీక్.. ఈ పదబంధాలు చాలు మనం మాట్లాడుకునేది విరాట్ కోహ్లీ గురించి అని తెలియడానికి. 12 ఏళ్ల కెరీర్‌లోనే అతను సాధించిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు తిరగరాస్తాడనడంలో సందేహం లేదు. వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం... మనం మాట్లాడుకునే కోహ్లీ వేరు. జిమ్‌లో అతను ఖర్చు చేసిన కేలరీలు, ఫిట్‌నెస్‌కిచ్చిన ప్రాధాన్యం, ఇష్టాలను వదలుకున్న కష్టం.... ఇవన్నీ వెరసి భారతజట్టులోనే ఫిట్టెస్ట్ క్రికెటర్‌గా మారిన కోహ్లీ.. నిన్న దాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించాడు.
డివిలియర్స్లా బ్యాటింగ్ చేసిన కోహ్లీ చెన్నైతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 52 బంతులాడి 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో కోహ్లీ 90 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 173.08 పై నుంచి చూస్తే ఇది సిసలైన టీ20 ఇన్నింగ్స్‌లానే కనిపిస్తుంది. కానీ లోతుగా గమనిస్తే మాత్రం ఇది అంతకుమించి....
తాను సాధించిన 90 పరుగుల్లో బౌండరీల ద్వారా కోహ్లీ సాధించింది 40 మాత్రమే. మిగతా 50 వికెట్ల మధ్య పరిగెట్టినవే. మూడో ఓవర్‌లోనే క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. చివరి దాకా నిలిచి ఆడిన డాట్ బాల్స్ కేవలం ఐదే. కొన్ని డాట్‌బాల్స్ ఆడి అయినా సరే.. బౌండరీస్‌తో దాన్ని కవర్ చేయొచ్చనుకునే టీ20ల్లో ఇది చాలా గొప్ప ఘనతే అని చెప్పుకోవాలి. క్రీజులోకి వచ్చిన దగ్గర్నుంచి దాదాపు ప్రతి బంతికీ పరుగు సాధించడానికే చూసిన కోహ్లీ.... తన సహచరులనూ తనతో పాటు పరుగులు పెట్టించాడు. కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చిన దగ్గర్నుంచి... తనవి, తన తోటివారివి కలుపుకుని మొత్తం 48 సింగిల్స్, 14 డబుల్స్ పరిగెట్టాడు. అతను ఉన్నంతసేపూ... జట్టు సాధించిన మొత్తం పరుగుల్లో 60శాతం పరిగెట్టడం ద్వారా వచ్చినవే.
పిచ్ నెమ్మదిగా ఉండి బ్యాటింగ్‌కు కష్టంగా మారటం వల్ల ఇన్నింగ్స్ సాంతం నిలిచేందుకే ప్రాధాన్యమిచ్చిన కోహ్లీ.. అనవసర షాట్లకు పోకుండా సంయమనం ప్రదర్శించాడు. ఏబీ డకౌటయ్యాక బాధ్యత మరింత పెరిగింది. తుదివరకూ ఉన్న కోహ్లీ ఆఖర్లో రెచ్చిపోయాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. అయితే బ్రావో వేసిన ఆఖరి ఓవర్‌లో కోహ్లీ ఆడిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
తొలి బంతికి బౌండరీ కొట్టిన కోహ్లీ.. తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో 4 డబుల్స్ సాధించాడు. దుబాయ్ వేడి, ఉక్కపోత వాతావరణంలో 17 ఓవర్ల పాటు ఆడాక కూడా ఆ వేగంతో అతను పరిగెట్టిన తీరు నిజంగా అమోఘం. అతని ఫిట్‌నెస్ ప్రమాణాలకు నిన్నటి ఇన్నింగ్స్ ఓ ప్రతీక అని చెప్పక తప్పదు. పిచ్‌కు తగినట్టుగా ఆటను మార్చుకోవాలని చెప్పడమే కాక.. టీ20ల్లో బౌండరీలే కాదు.... సింగిల్స్, డబుల్స్ సైతం ఫలితాన్ని నిర్దేశిస్తాయనడానికి నిన్నటి కింగ్ కోహ్లీ ఇన్నింగ్స్ ఓ చక్కని ఉదాహరణ.
చెన్నైతో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్