ఇప్పుడంతా బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం. ఒక ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉన్నా.. బౌలింగ్ జట్టు గెలుస్తుందన్న గ్యారెంటీ లేని రోజులువి. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ అయినా.. సూపర్ ఓవర్ అయినా బ్యాట్స్‌మెన్ విధ్వంసాలే చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో సూపర్ ఓవర్లో ఒక బౌలర్ 2 వికెట్లు తీసి 2 పరుగులకే అవతలి జట్టును పరిమితం చేస్తే.. మరో బౌలర్ ఓవర్లో 5 పరుగులకే రెండు వికెట్లు పడగొడితే.. తర్వాత అవతలి జట్టు బౌలర్ అన్నే పరుగులిచ్చి సూపర్ ఓవర్‌ను టైగా మారిస్తే..? ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు ఇలాంటి గణాంకాల గురించి చెబితే నవ్వేవాళ్లేమో! కానీ ఆ రోజు రాత్రి ఈ అద్భుతాలే చోటు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలే ఐపీఎల్‌ను రసవత్తరంగా మార్చాయి.
కథ మారింది
90వ దశకంలో దక్షిణాఫ్రికాతో హీరో కప్ మ్యాచ్‌లో సచిన్ తెందుల్కర్ చివరి ఓవర్‌ను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. 2 వికెట్లు చేతిలో ఉన్న సఫారీ జట్టు 6 పరుగులు చేయాల్సి ఉంటే.. సచిన్ కేవలం రెండే పరుగులిచ్చి 3 పరుగుల తేడాతో భారత్ గెలిచేలా చేశాడా మ్యాచ్‌లో. అప్పట్లో ఇలా చివరి ఓవర్లో అయిదారు పరుగులు చేయలేక జట్లు ఓడిపోయిన సందర్భాలు ఎన్నో. అప్పుడు బ్యాటుకు, బంతికి మధ్య పోరు హోరాహోరీగా సాగేది. కానీ తర్వాతి కాలంలో కథ మారుతూ వచ్చింది. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం పెరిగిపోయింది.
టీ20ల రాకతో, ముఖ్యంగా ఐపీఎల్ ఆగమనంతో బ్యాట్స్‌మెన్‌కు ఎదురు లేకుండా పోయింది. భారత్‌లో ఐపీఎల్ జరిగేపుడు ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌దే హవా. ఈసారి యూఈఏతో జరుగుతున్న లీగ్‌లోనూ ఆరంభ మ్యాచ్‌ల్లో బ్యాటు జోరే కనిపించింది. షార్జాలో అయితే బ్యాట్స్‌మెన్ పట్టపగ్గాల్లేకుండా కనిపించారు. 200 చేయడం తేలికైపోయింది. అంత కంటే పై లక్ష్యాన్నీ ఛేదించేశారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారాయి. బౌలర్లు పోటీలోకి వచ్చారు. 170 దాటితే భారీ స్కోరుగా మారిపోయింది. లక్ష్యం 160 దాటితే ఛేదన కష్టమైపోతోంది. ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లు సమానంగా సత్తా చాటుతున్నారు.