ఎంతలో ఎంత మార్పు! ఎలా ఉండేది కొన్నాళ్ల క్రితం పరిస్థితి? ఎక్కడ చూసినా కరోనా వార్తలే.. లాక్‌డౌన్ ముచ్చట్లే.. రాకపోకలు బంద్.. కలుసుకోవడాల్లేవ్.. ఆటల్లేవ్.. పాటల్లేవ్.. మానసిక ఉల్లాసానికి ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ దాదాపు ఆరు నెలలు వాయిదా పడినా సోకు ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే గత పన్నెండు సీజన్ల కన్నా మరిన్ని ట్విస్టులతో, ఎంతో ఉత్కంఠంగా సాగింది. బ్యాట్స్‌మెన్స్ పరుగుల వరద.. బౌలర్ల హ్యాట్రిక్ వికెట్ల ప్రదర్శన.. అప్పటిదాకా ఓడిపోతుందనుకున్న జట్టు గెలవడం.. కళ్లు చెదిరే సిక్సర్లతో యువ ఆటగాళ్ల ధనాధన్ ఇన్నింగ్స్.. అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే ఈ సీజన్లో ఎన్నో అద్భుతాలే ఉన్నాయి.
మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే సూపర్ ఓవర్. ఎందుకంటే గత పన్నెండు సీజన్లతో పోలిస్తే ఈ సారి ఏకంగా ఐదు మ్యాచులు అదనపు ఓవర్లకు దారి తీశాయి. లీగ్ చరిత్రలోనే తొలిసారి డబుల్ సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్ కూడా ఈ సీజన్లోనే ఉంది. వీటన్నింటి నడుమ అప్పుడే కాల చక్రం గిర్రున తిరిగి లీగ్ ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. ఈ సందర్భంగా మనల్ని ఆకట్టుకున్న ఇప్పటివరకు జరిగిన 56 మ్యాచుల్లోని సూపర్ ఓవర్ల విశేషాల్ని ఓసారి చూద్దాం.
సూపర్ ఓవర్ విశేషాలు
గత పన్నెండు సీజన్లలో జరిగిన మ్యాచ్‌ల్లో కేవలం తొమ్మిదిసార్లు మాత్రమే సూపర్ ఓవర్‌కు దారి తీశాయి. అందులో 2009, 2013లో తలో రెండుసార్లు సూపర్ ఓవర్ల మ్యాచ్‌లు ఆడారు. అయితే ఈ పదమూడో సీజన్లో మాత్రం ఏకంగా ఐదు సూపర్ ఓవర్లు పడ్డాయి. అవేంటంటే?
2019 వరకు అదనవు ఓవర్ల మ్యాచ్‌లు
కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్(2009).. రాయల్స్ విజయం
చెన్నై సూపర్ కింగ్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్(2010).. పంజాబ్ విజయం
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(2013).. హైదరాబాద్ విజయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs దిల్లీ క్యాపిటల్స్(2013).. బెంగళూరు విజయం
కోల్‌కతా రాజస్థాన్ vs రాజస్థాన్ రాయల్స్(2014).. రాయల్స్ విజయం
రాజస్థాన్ రాయల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్(2015).. పంజాబ్ విజయం
గుజరాత్ లయన్స్ vs ముంబయి ఇండియన్స్(2017).. ముంబయి విజయం
దిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్(2019).. దిల్లీ విజయం
ముంబయి ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్(2019).. ముంబయి విజయం
2020 సూపర్ ఓవర్ల మ్యాచులు
పంజాబ్vsముంబయి మ్యాచ్
దుబాయ్ వేదికగా ఉత్కంఠంగా సాగిన ఈ పోరు అభిమానులు కోరుకునే అసలైన మజా ఇచ్చింది. రెండు సూపర్ ఓవర్లు ఈ మ్యాచ్‌లోనే పడ్డాయి. అయితే విజయం పంజాబ్‌నే వరించింది. లీగ్ చరిత్రలోనే ఒక్క మ్యాచ్‌లోనే రెండు సూపర్ ఓవర్లు ఆడిన తొలి మ్యాచ్ ఇదే.
తొలి సూపర్ ఓవర్ సాగిందిలా
తొలి సూపర్ ఓవర్‌లో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. రాహుల్, పూరన్ బ్యాటింగ్ చేయగా 5 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి కూడా సరిగ్గా 5 పరుగులు చేయడం వల్ల రెండో సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
రెండో సూపర్ ఓవర్ ఇలా సాగింది..
ముంబయి ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, పొలార్డ్ బ్యాటింగ్‌కు దిగి 11 పరుగులు చేశారు. అనంతరం ఛేదన ఆరంభించిన పంజాబ్ గేల్, మాయంక్ ధనాధన్ బ్యాటింగ్‌తో.. నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి విజయం సాధించింది.
హైదరాబాద్vs కోల్‌కతా మ్యాచ్
అక్టోబర్ 18న జరిగిన ఈ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠంగా సాగింది. హైదరాబాద్‌పై కోల్‌కతా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ 163 పరుగులు చేయడం వల్ల మ్యాచ్ టై అయింది. అనంతరం హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కారణంగా కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది.
బెంగళూరు vs ముంబయి మ్యాచ్
సెప్టెంబర్ 28న బెంగళూరు, ముంబయి మ్యాచ్‌లో ఇరు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేశాయి. సూపర్ ఓవర్‌లో కోహ్లీసేన విజయం సాధించింది. అయితే ముంబయి గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ఐపీఎల్లో ఒక్కసారి కూడా సూపర్ ఓవర్‌లో విఫలమవని బుమ్రా.. ఈ మ్యాచ్‌లోను బాగానే వేసినప్పటికీ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆ పరుగుల్ని ఛేదించారు. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 7 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఆఖరి బంతికి పూర్తి చేసింది బెంగళూరు.
దిల్లీvsపంజాబ్ మ్యాచ్
సూపర్ థ్రిల్లింగ్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 158 పరుగులు చేయడం వల్ల మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్‌లో పంజాబ్ పూర్తిగా విఫలమైంది. రెండు పరుగులకే చేయగలిగింది. కేఎల్ రాహుల్, పూరన్ వరుస బంతుల్లో ఔటయ్యారు. అనంతరం దిల్లీ తరఫున శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ రెండు బంతుల్లో లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో దిల్లీ విజయం సాధించింది.
వచ్చే ఏడాది అక్కడే
కరోనా పరిస్థితుల దృష్యా ఈ ఐపీఎల్‌ను యూఏఈలో షార్జా, అబుదాబి, దుబాయ్ వేదికగా ఈ మ్యాచులన్నీ జరిగాయి. వచ్చే ఏడాది కూడా దాదాపుగా అక్కడే నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి గాయం తగ్గింది.. బాగానే ఉన్నాను: రోహిత్ శర్మ