ఐపీఎల్ అంటేనే అభిమానులకు, క్రీడాకారులకు యమ జోరును ఇస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటా ఆటగాళ్లు చూపే అద్భుత ప్రదర్శన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఐపీఎల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం ఒకెత్తయితే.. నమ్మశక్యం కాని అదే లక్ష్యాన్ని ఎంతో సునాయాసంగా ప్రత్యర్థి జట్టు ఛేదించడం మరొకెత్తు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది రాజస్థాన్ రాయల్స్. ఈ నేపథ్యంలో అలాంటి టాప్-5 ఛేదనలపై ఓ లుక్కేద్దాం.
చెన్నై vs బెంగళూరు(2012)
2012 ఐపీఎల్లో చెన్నై-బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీని.. సీఎస్కే 205 పరుగులకు పరిమితం చేసింది. ఆ తర్వాత ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మన్ మురళీ విజయ్(11), రైనా(23) విఫలమయ్యారు. తర్వాత డుప్లెసిస్(71), ధోనీ(41) అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలుపు దిశగా మలుపుతిప్పారు. అయితే, మిడిల్ ఓవర్లలో వికెట్లు పడటం వల్ల.. చెన్నైకి గట్టి సవాలు ఎదురైంది. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో వచ్చిన బ్రావో(25), మోర్కెల్(28) తమదైన స్టైల్లో దూకుడు పెంచారు. ఇక చివర్లో వచ్చిన జడేజా సింగిల్ బౌండరీతో.. ఉత్కంఠభరిత పోరులో చెన్నైకి విజయాన్నందించాడు.
పంజాబ్ vs హైదరాబాద్(2014)
ఐపీఎల్ ఉత్తమ మ్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచిన వాటిల్లో 2014లో పంజాబ్ vs హైదరాబాద్ పోరు ఒకటి. తొలుత బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ 205 పరుగులు చేసి.. పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఛేజింగ్‌కు దిగిన పంజాబ్.. ఎంతో సునాయాసంగా మ్యాచ్‌ను గెలుపు దిశగా తీసుకెళ్లి 211 పరుగులు సాధించి ముగించింది. పంజాబ్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. వోహ్రా(47), మ్యాక్స్‌వెల్(43) కూడా జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు.
గుజరాత్ లయన్స్ vs దిల్లీ డేర్‌డెవిల్స్ దిల్లీ డేర్‌డెవిల్స్ vs గుజరాత్ లయన్స్(2017)
2017లో దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో అంతా కుర్రాళ్లే. ముఖ్యంగా టాప్ ఐదుగురు ఏ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేనివారు కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ 208 పరుగులు చేసి.. దిల్లీకి భారీ టార్గెట్ విధించింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన దిల్లీ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్(61), రిషభ్ పంత్(97) అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఫలితంగా 15 బంతులు మిగిలి ఉండగానే 214 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది దిల్లీ.
దక్కన్ చార్జర్స్ vs రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ vs దక్కన్ చార్జర్స్ (2008)
ఐపీఎల్ ప్రారంభమైన తొలి ఏడాదిలో స్కోరును 160 దాటించడమంటే పెద్ద సవాలు. అలాంటిది రాజస్థాన్ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది దక్కన్ చార్జర్స్. ఛేదనలో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ స్మిత్(71), యూసఫ్ పఠాన్(61) జట్టును గెలుపు దిశగా నడిపించారు. మహమ్మద్ కైఫ్(34), షేన్ వార్న్(22) చివర్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. దీంతో 7 వికెట్ల నష్టంతో 217 పరుగులు చేసి.. విజయ ఢంకా మోగించింది రాజస్థాన్.
పంజాబ్ vs రాజస్థాన్ (2020)
ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో ఉత్తమమైందిగా నిలిచింది. మొదట బ్యాటింగ్ దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(69) మరోసారి తన బ్యాటింగ్‌తో సత్తా చాటగా.. మయాంక్ అగర్వాల్(106) అద్భుత సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీ సాధించాడు. సంజూ శాంసన్ 85 పరుగులు చేశాడు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యంతో జట్టు గెలుపుపై నమ్మకాన్ని పెంచారు. వీరు ఔటైన తర్వాత రాహుల్ తెవాటియా బ్యాటింగ్ మరో అద్భుతం. తొలి 19 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసిన అతడు.. 18వ ఓవర్లో ఐదు సిక్సులు బాది.. మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఫలితంగా 3 బంతులు మిగిలుండగానే 226 పరుగులు సాధించి ఘన విజయం దక్కిచుకుంది రాజస్థాన్. లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన ఫ్రాంచైజీగా రికార్డు సృష్టించింది.