తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీతో గొడవ... డోర్​ పగలగొట్టిన అంపైర్​! - ఇంగ్లీష్​ సీనియర్​ అంపైర్​ నిగెల్​ లాంగ్​

ఇంగ్లిష్‌ సీనియర్‌ అంపైర్‌ నిగెల్‌ లాంగ్‌ వివాదంలో చిక్కుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో అంపైర్‌ గది డోర్‌ను నిగెల్‌ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం బీసీసీఐ వరకు వెళ్లింది. అయితే మే 12న జరగనున్న ఐపీఎల్​ ఫైనల్ మ్యాచ్​కు ఆయనే​ అంపైర్​గా వ్యవహరిస్తుండటం గమనార్హం.

కోపంతో డోర్​ పగులగొట్టిన అంపైర్​

By

Published : May 7, 2019, 2:18 PM IST

ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా శనివారం బెంగళూరు వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌కు ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ను ఆర్‌సీబీ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేశాడు. ఈ ఓవర్​లో ఉమేశ్‌ సరైన డెలివరీ వేసినప్పటికీ అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించారు. ఈ విషయం రీప్లేలో లీగల్‌ డెలివరీ అని తేలింది. దీనిపై ఉమేశ్​ , ఆర్సీబీ సారథి విరాట్​ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోబాల్‌ ఎలా అవుతుందని ప్రశ్నించిన ఉమేశ్‌పై అంపైర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బౌలింగ్‌ వేయడానికి వెళ్లు అంటూ సూచించడం టీవీల్లోనూ కనిపించింది.

అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, ఉమేశ్​ అసంతృప్తి

ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో స్టేడియంలో అంపైర్లకు కేటాయించిన రూమ్‌కు ఆగ్రహంతో వెళ్లిన నిగెల్​ లాంగ్​.. డోర్‌ను కాలితో గట్టిగా తన్ని ధ్వంసం చేశాడు. దీనిపై బీసీసీఐ అంతర్గత విచారణ చేపట్టినా అతడిని ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అంపైరింగ్‌ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

"ఇది ఊహించని ఘటన. మా విధి ప్రకారం బీసీసీఐకి ఫిర్యాదు చేశాం. తుది నిర్ణయం పాలకమండలి చేతిలో ఉంటుంది"
-- ఆర్​. సుధాకర్​ రావు, కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ

డోర్‌ పగలగొట్టినందుకు లాంగ్‌.. రూ. 5వేలు జరిమానా కట్టారని సుధాకర్ రావు వెల్లడించాడు. క్రికెట్​ నియమావళి ఉల్లంఘన కింద బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న లాంగ్‌ ఇప్పటి వరకు 56 టెస్టులు, 123 వన్డేలు, 32 టీ20లకు అంపైర్‌గా వ్యవహరించారు. మే 30 నుంచి ఇంగ్లాండ్‌లో ఆరంభంకానున్న వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీకి అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details