ఆ పక్క విరాట్ కోహ్లి, డివిల్లియర్స్... ఈ పక్క డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్... ఆ వైపు చాహల్, ఉమేశ్ యాదవ్.. ఈ వైపు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్... ఆ పక్క స్టార్లతో కూడిన హిట్టర్లు.. ఈ పక్క నిలకడగా ఆడుతూ ప్రతాపం చూపించే ఆటగాళ్లు. ఈ పాటికి అర్థమై ఉంటుంది.. ఈ రోజు మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో రెండు జట్ల హోరాహోరీగా తలపడనున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్...
ఏడాది నిషేధం తర్వాత పునరాగమనం చేసిన డేవిడ్ వార్నర్ భీకరంగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో(కోల్‌కతా) 85 పరుగులతో రెచ్చిపోగా, రెండో మ్యాచ్‌లో(రాజస్థాన్) 37 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో 35, 45 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో విజయ్ శంకర్, యూసూఫ్ పఠాన్లతో బలంగా ఉంది సన్‌రైజర్స్ జట్టు. గత మ్యాచ్‌లో విజయ్ 15 బంతుల్లో 35 పరుగులతో జట్టును గెలిపించాడు.
గత సీజన్లో బౌలింగ్ బలంగా ఉన్న సన్‌రైజర్స్ జట్టు ఈ సీజన్లో అంతగా రాణించలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ధారాళంగా పరుగులు(183, 199) సమర్పించుకున్నారు. రషీద్ ఖాన్, భువనేశ్వర్ పర్వాలేదనిపించినా మిగతా బౌలర్లు రాణించాల్సి ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఎన్నో అంచనాల మధ్య ఈ సీజన్లో అడుగుపెట్టిన బెంగళూరు జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేయట్లేదు. తొలి మ్యాచ్‌లో(చెన్నై) 70 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో మ్యాచ్(ముంబయి)లో రాణించినప్పటికీ చివర్లో మ్యాచ్ చేజార్చుకుంది. ముంబయి 187 పరుగుల లక్ష్యం నిర్దేశిస్తే 181 పరుగులే చేసింది. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన విరాట్, రెండో మ్యాచ్‌లో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. డివిలియర్స్ రెండో మ్యాచ్‌లో 70పరుగులతో విజృభించినా జట్టుకు విజయం చేకూర్చలేకపోయాడు. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. హిట్మైర్, గ్రాండ్ హోమ్ ఫామ్ అందుకోవాల్సి ఉంది.