తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆఖర్లో హార్దిక్ మెరుపులు.. గెలుపు ముంబయిదే - హార్దిక్ పాండ్య

సొంతగడ్డపై బెంగళూరుతో జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. చివర్లో వచ్చి తన బ్యాటింగ్​తో జట్టును గెలిపించాడు ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య. 4 వికెట్లు తీసిన మలింగ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

ఆఖర్లో హార్దిక్ మెరుపులు.. గెలుపు ముంబయిదే

By

Published : Apr 16, 2019, 12:09 AM IST

వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబయి గెలిచింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది. ఆఖర్లో వచ్చిన హార్దిక్ పాండ్య 16 బంతుల్లో 37 పరుగులు చేసి ముంబయిని విజయ తీరాలకు చేర్చాడు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఓపెనర్లు రోహిత్, డికాక్..అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్​కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 28 రన్స్ చేసిన రోహిత్..మొయిన్ అలీ బౌలింగ్​లో ఔటయ్యాడు. వెంటనే 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డికాక్ కూడా వెనుదిరిగాడు.

అనంతరం వచ్చిన ఏ బ్యాట్స్​మెన్ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. సూర్యకూమార్ యాదవ్ 29, ఇషాన్ కిషన్ 21, కృనాల్ 11 పరుగులే చేయగలిగారు.

ఆఖర్లో వచ్చాడు..అదరగొట్టాడు

విజయానికి 43 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య..ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 16 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

బెంగళూరు బౌలర్లలో చాహల్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్​కు ఓ వికెట్ దక్కింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరుకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగులు చేసిన కోహ్లి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్..మొయిన్ అలీతో కలిసి మూడో వికెట్​కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ.. మలింగ బౌలింగ్​లో పెవిలియన్ బాట పట్టాడు. 75 పరుగులు చేసిన డివిలియర్స్ చివరి ఓవర్​లో ఔటయ్యాడు.
మిగతా బ్యాట్స్​మెన్​లో పార్థివ్ 28, అక్షదీప్ నాథ్ 2 పరుగులు చేశారు. స్టాయినిస్, నేగి డకౌట్​గా వెనుదిరిగారు.

ముంబయి బౌలర్లలో మలింగ 4 వికెట్లు తీశాడు. బెరెండార్ఫ్​, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details