తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నైపై గెలుపు.. ఫైనల్​లో ముంబయి అడుగు - గెలుపు

చెపాక్ వేదికగా చెన్నైతో జరిగిన క్వాలిఫయర్​-1 మ్యాచ్​లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లింది రోహిత్ సేన. సూర్యకుమార్ యాదవ్ (71, 54 బంతుల్లో) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ గెలుపుతో ముంబయి ఐదోసారి ఐపీఎల్​ ఫైనల్లో అడుగుపెట్టనుంది.

సూర్యకుమార్ యాదవ్

By

Published : May 7, 2019, 11:19 PM IST

Updated : May 8, 2019, 12:18 AM IST

చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన క్వాలిఫయర్​-1​ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో గెలిచి ఐపీఎల్ ఫైనల్​ బెర్త్​ ఖరారు చేసుకుంది రోహిత్ సేన. 132 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (71, 54 బంతుల్లో) అర్ధశతకంతో ఆకట్టుకోగా... ఇషాన్ కిషన్​ (28) రాణించాడు. చెన్నై బౌలర్లలో తాహిర్ రెండు వికెట్లు తీయగా, హర్భజన్, దీపక్ చాహర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు​ సూర్యకుమార్ యాదవ్​కు దక్కింది.

టాస్ ఓడి బౌలింగ్ చేసిన ముంబయి జట్టు చెన్నైని 131 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్​ దిగిన ముంబయి ఆరంభంలోనే రోహిత్ (4)​ వికెట్​ను కోల్పోయింది. కాసేపటికే డికాక్ వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ - ఇషాన్ కిషన్ జోడి నిలకడగా ఆడుతూ... జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. ఇబ్బందిపడకుండా ఆడిందీ జోడీ. అనంతరం చెన్నై బౌలర్ తాహిర్ వరుస బంతుల్లో ఇషాన్ కిషన్, కృణాల్​ పాండ్యను ఔట్ చేసి ముంబయిని ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ చివర్లో సూర్యకుమార్ యాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించాడు.

సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకం..

ఓ పక్క వికెట్లు కోల్పోతున్నా మ్యాచ్​ను దగ్గరుండి గెలిపించాడు సూర్యకుమార్ యాదవ్. చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొని ప్రత్యర్థికి విజయాన్ని దూరం చేశాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేసి కెరీర్​లో ఆరవ అర్ధశతకాన్ని నమోదు చేశాడు.

మొదట బ్యాటింగ్ చెసిన చెన్నై జట్టులో ధోనీ (37), అంబటి రాయుడు (42) మినహా మిగతా బ్యాట్స్​మెన్ రాణించలేదు. ముంబయి బౌలర్ రాహుల్ చాహర్ 2 కీలక వికెట్లు తీసి చెన్నై పతనంలో కీలకపాత్ర పోషించాడు. కృణాల్, జయంత్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్​ రికార్డులు..

చెన్నైపై వరుసగా నాలుగు మ్యాచ్​ల్లో గెలిచిన జట్టుగా ముంబయి ఇండియన్స్​ రికార్డు సృష్టించింది.

  1. 2018 పుణెలో 8 వికెట్ల తేడాతో ముంబయి గెలుపు
  2. 2019 వాంఖడే వేదికగా 37 పరుగుల తేడాతో విజయం
  3. 2019 చెన్నై వేదికగా 46 పరుగులు తేడాతో విజయం
  4. 2019 చెన్నై వేదికగా 6 వికెట్ల తేడాతో విజయం
  • చెపాక్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ గత 21 మ్యాచ్​ల్లో 18 గెలవగా.. మూడింటిలో ఓడిపోయింది.
  • ఐపీఎల్​లో ఎక్కువ సార్లు ఫైనల్ వెళ్లిన జట్టు చెన్నై సూపర్​కింగ్స్​(7) కాగా.. ముంబయి 5 సార్లు తుదిపోరుకెళ్లి రెండో స్థానంలో ఉంది. ఆర్​సీబీ 3 సార్లు వెళ్లి మూడో స్థానంలో ఉంది.
Last Updated : May 8, 2019, 12:18 AM IST

ABOUT THE AUTHOR

...view details