సాధారణంగా క్రికెట్లో బంతి వికెట్లకు తాకితే ఔట్‌గా ప్రకటిస్తారు.. కానీ ఇందులో ఓ మతలబు ఉంది కచ్చితంగా బెయిల్స్ కింద పడాలన్నది నిబంధన. వికెట్లకు బంతి తగిలినా బెయిల్స్ కింద పడకపోవడం ఈ ఐపీఎల్లో ఇప్పటికే మూడుసార్లు జరిగింది. అందుకే నెట్టింట ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఫెవికాల్తో అతికించేశారా ఏంటి అంటూ నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.
- మొదటిసారి మిస్టర్కూల్కే
చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్.. అప్పటికే 4 వికెట్లు కోల్పోయింది చెన్నై జట్టు. క్రీజులోకి వచ్చిన ధోని మొదటి బంతికే ఔటయ్యేవాడు. బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన 6వ ఓవర్ మూడో బంతి బ్యాట్ లోపలి అంచుకు తాకుతూ వికెట్లకు తగిలింది. ఇంకేముంది రాయల్స్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. కానీ బంతి వికెట్లకు తాకినా బెయిల్స్ పడలేదు. అది కాస్తా నాటౌట్‌గా పరిగణించారు. అవకాశాన్ని వినియోగించుకున్న ధోని నిలకడగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్.. ఓపెనర్ క్రిస్‌లిన్ తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్ పేసర్ ధావల్ కులకర్ణి వేసిన రెండో బంతి బ్యాటు లోపలి అంచుకు తగిలి స్టంప్స్‌ను తాకింది. కానీ బెయిల్స్ కిందపడలేదు. ఫలితం అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇంకేముంది రాజస్థాన్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లు లిన్, నరైన్ కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించేశారు. 8 వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం సాధించింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై జట్ల మధ్య చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ ఇలాంటి సన్నివేశమే పునరావృతమైంది. పంజాబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జడేజా వేసిన బంతికి రన్ కోసం రాహుల్ ప్రయత్నించగా.. ధోని తనదైన మార్క్ కీపింగ్‌తో వేగంగా బంతిని వికెట్లకు కొట్టాడు. కానీ బెయిల్స్ మాత్రం పడలేదు. రాహుల్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నా పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు.