తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ హాట్​ కేకులు ​నిమిషాల్లోనే మాయం!

ఐపీఎల్‌-12 ఫైనల్‌ టిక్కెట్ల అమ్మకంలో ఏదైనా మాయాజాలం జరిగిందా...! ఎవరికీ తెలియకుండా... ఎలాంటి ప్రచారం లేకుండా టికెట్ల అమ్మకాలు ప్రారంభమవడం, అరంగటలోపే అన్నీ అమ్ముడైపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొందరేమో టికెట్లు బ్లాక్​ చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఐపీఎల్ హాట్​ కేకుల్ని ​నిముషాల్లో లాగించేశారు..!

By

Published : May 8, 2019, 1:00 PM IST

హైదరాబాద్‌లో జరగనున్న ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్​ టికెట్లు నిమిషాల వ్యవధిలో సేల్​ అయిపోయాయి. ఇలా జరగడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.

ప్రచారం నిల్​...

ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులో పెట్టి ప్రకటన చేసిన ఐపీఎల్‌ నిర్వాహకులు.. ఫైనల్‌ విషయంలో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చడీచప్పుడు లేకుండా.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆన్​లైన్​ టికెట్ల విక్రయం ప్రారంభించింది ఈవెంట్స్‌.కామ్‌ సంస్థ. కనీసం కొన్ని గంటల ముందైనా పత్రికలు, టీవీ ఛానెళ్లకు కనీస సమాచారం ఇవ్వలేదు. గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టి... కొన్ని నిమిషాల్లోనే ఖాళీ అయిపోనట్లు బోర్డు పెట్టేశారు. రూ.1500, రూ.2000, రూ.2500, రూ.5000 టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు.

టికెట్లు అమ్ముడైపోయినట్లు చూపిస్తున్న వెబ్​సైట్​

స్పందన కరవు...

రూ. 500, రూ.1000 టిక్కెట్ల సంగతి ఏమైంది.? ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు? ఎన్ని అమ్ముడయ్యాయి? ఏ టిక్కెట్లు ఎవరు కొన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ విషయంపై ఈవెంట్స్‌నౌ ప్రతినిధి సుధీర్‌ను, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సీఈఓ పాండురంగ మూర్తిని సంప్రదించినా ఫలితం లేకపోయింది. వీరిద్దరూ అందుబాటులోకి రాలేదు.

విమర్శల పర్వం...

టిక్కెట్ల అమ్మకాలపై ఈవెంట్స్‌నౌ.కామ్‌, హెచ్‌సీఏ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

"సాధారణంగా మ్యాచ్‌ టిక్కెట్ల గురించి పత్రికలు, టీవీ ఛానెళ్ల ద్వారా అభిమానులకు సమాచారం అందించడం ఆనవాయితీ. ఐపీఎల్‌ ఫైనల్‌ ఆదరణ దృష్ట్యా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. కానీ ఈవెంట్స్‌నౌ.కామ్‌, హెచ్‌సీఏ మొదట్నుంచీ టిక్కెట్ల అమ్మకంపై గుట్టుగానే ఉన్నాయి. ఎవరికీ కనీస సమాచారం అందించలేదు. రోజువారీ టిక్కెట్ల అమ్మకాల గురించి బీసీసీఐ, హెచ్‌సీఏలకు సమాచారం ఇవ్వాలి. ఈవెంట్స్‌నౌ సంస్థ ఆ పని చేసిందో లేదో తెలియదు. ఫైనల్‌కు ఆదరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మాలని ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి "
-- హెచ్‌సీఏ అధికారి

"కొన్ని నిమిషాల వ్యవధిలో 38 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉంది. నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు చూపించకుండా టిక్కెట్లు తీసుకోడానికి వీల్లేదు. ఎవరు ఏ సమయంలో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు? వారి గుర్తింపు కార్డుల్ని ఈవెంట్స్‌నౌ.కామ్‌ చూపిస్తుందా?"
- హెచ్‌సీఏ క్లబ్‌ సభ్యుడు

ABOUT THE AUTHOR

...view details