పేరు, జెర్సీనే కాదు...ఆటతీరు మారింది దిల్లీ క్యాపిటల్స్ జట్టుది. తాజాగా రాజస్థాన్ జట్టుపై విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ గత 11 సీజన్లలో ఎప్పడు సాధించని ఈ రికార్డు 12వ సీజన్‌లో అందుకుంది.
ఐపీఎల్ టోర్నీలో తొలిసారి టాప్‌లో 'దిల్లీ' - ipl
దిల్లీ క్యాపిటల్స్... ఐపీఎల్లో గత 11 సీజన్లుగా నిరాశపరుస్తూ వస్తోన్న జట్టు. కాని ఈ ఏడాది పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొలిస్థానంలో నిలిచింది. దిల్లీ ఆటతీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ నెగ్గి ఈ ఘనతను సొంతం చేసుకుంది దిల్లీ. ప్రత్యర్థి ఆటగాడు అంజిక్య రహానే సెంచరీతో అదరగొట్టినా, స్మిత్ హాఫ్ సెంచరీతో చెలరేగినా...దిల్లీ యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, పృథ్వీషా, సీనియర్ బ్యాట్స్‌మన్ ధావన్‌ల సాయంతో లక్ష్యాన్ని ఛేదించేశారు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన దిల్లీ జట్టు...7 విజయాలు సాధించి 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ తాజా రికార్డుతో ఎన్నో ఏళ్ల కల ఫలించిందంటూ దిల్లీ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఆకట్టుకోడానికి సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ సలహాలే కారణమని యువ ఆటగాడు పృథ్వీషా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆట అనంతరం సలహాదారు సౌరవ్ గంగూలీ...రిషభ్‌ను ఎత్తుకొని అభినందించాడు. సరిగ్గా 2002లోనూ ప్రస్తుత సహాయక కోచ్ మహ్మద్ కైఫ్‌ను దాదా ఎత్తుకోవడం విశేషం.