వరుస విజయాలతో దూసుకెళ్తూ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది చెన్నై. వరుసగా రెండు అపజయాలతో డీలా పడిన కోల్‌కతా మళ్లీ దూకుడు పెంచాలనుకుంటోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీటి మధ్య ఈడెన్‌గార్డెన్స్ వేదికగా నేటి సాయంత్రం 4గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే ఈ సీజన్లో చెన్నైతో ఓ మ్యాచ్‌లో ఓడింది కోల్‌కతా. సొంతగడ్డపై జరిగే ఈ పోరులో గెలవాలని పట్టుదలతో ఉంది. రసెల్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది.
కోల్‌కతా నైట్ రైడర్స్..
దిల్లీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన కోల్‌కతా.. చెన్నైపై ఇది పునరావృతం కానివ్వకూడదని భావిస్తోంది. గత మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అర్ధశతకంతో రాణించాడు. రసెల్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది రైడర్స్. జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి రావాల్సిన అవసరముంది. దిల్లీతో మ్యాచ్‌లో రసెల్‌కు గాయమైంది. నేటి మ్యాచ్‌లో అతడు ఉంటాడా లేదా అనేది చూడాలి.
ప్రపంచకప్ బెర్త్ కోసం చూస్తున్న దినేశ్ కార్తీక్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతడు సత్తా చాటాల్సిన అవసరముంది. బౌలర్లలో ఫెర్గ్యూసన్, ప్రసిధ్ కృష్ణ నిలకడగా రాణిస్తున్నారు. కుల్దీప్, నరైన్, పియూష్ చావ్లాలతో స్పిన్ విభాగం బలంగా ఉంది.