నాటింగ్‌హామ్‌లో వర్షం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు(India vs England test) ఐదో రోజు రద్దవ్వడంపై టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆట జరగకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డాడు.
"తొలి టెస్టు మూడు, నాలుగు రోజుల్లో వర్షం పడుతుందని అనుకున్నాం. కానీ ఐదో రోజు అలా జరిగింది. ఆట కొనసాగి ఉంటే బాగుండేది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం కీలకంగా మారింది. 40 పరుగుల ఆధిక్యం ఉంటే బాగుంటుంది అనుకున్నాం. కానీ 95పరుగులు దక్కాయి. ఐదో రోజు ఆట జరగకపోవడం సిగ్గుచేటు. ముందు రోజు 50 పరుగులు చేయడం కూడా అనుకూలమే. ఆలౌట్ అవ్వకుండా ఉండేదుకు ఆడలేదు. గెలుపుకోసమే ఆలోచించాం. సిరీస్ మొత్తం ఇదే దృక్పథంతో ఉంటాం. ఈ కాంబినేషన్లనే కొనసాగించే అవకాశముంది."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా సారథి.
అయితే తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు ఆ జట్టు కెప్టెన్ జో రూట్ అభిప్రాయపడ్డాడు.
"గెలుపు అవకాశాలు టీమ్ఇండియాకే ఎక్కువ అని అంగీకరించాల్సిందే. కానీ ఐదో రోజు ఓ దశలో కనీసం 40ఓవర్ల ఆట సాధ్యపడేలా కనిపించింది. అలాంటి పిచ్‌పై కొన్ని వికెట్లు తీస్తే చాలు. కథ మారిపోతుంది. నా వరకు అయితే.. ఆట సాగి ఉంటే టీమ్ఇండియాను ఓడించేందుకు మాకు 9 అవకాశాలు వచ్చుండేవి. బ్యాట్స్‌మెన్ మీద ఒత్తిడి పడేది. మైదానంలో చురుకుగా ఉంటే సిరీస్‌లో 1-0తో ముందుకెళ్లే వాళ్లం. కానీ వాతావరణం మాకు సహకరించలేదు. మంచి మ్యాచ్‌ను వాతావరణం పాడుచేసింది. ఇది ఒక రకంగా సిగ్గుచేటు."
-జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్.
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌సేన 278 పరుగులు చేసి.. విలువైన 92 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. బదులుగా ఇంగ్లాండ్ 303 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక లక్ష్య ఛేదనలో బరిలో దిగిన కోహ్లీసేన 4వ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52పరుగుల వద్ద నిలిచింది. చివరి రోజు 157 పరుగులు కొట్టాల్సి ఉండగా.. వరుణుడు కనికరించకపోవడం వల్ల మ్యచ్ డ్రాగా మారింది.
ఇదీ చూడండి:-కోహ్లీ గోల్డెన్ డక్.. కుంబ్లే రికార్డు సమం చేసిన జిమ్మీ