టీమ్‌ఇండియా 1971లో ఇంగ్లాండ్‌పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదనే నమ్మకం కలిగిందని హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన చిన్ననాటి రోజులు గుర్తుచేసుకున్నాడు. ఆ చారిత్రక ఘట్టం జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీసీసీఐ నాటి మ్యాచ్ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి స్పందిస్తూ ఆ రోజుల్లో తాను రేడియోలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నానని చెప్పాడు.
"నేనప్పుడు తొమ్మిదేళ్ల కుర్రాడిగా ఉన్నా. ఆ మ్యాచ్ ఎలా సాగిందో నాకింకా గుర్తుంది. ప్రతి బాల్‌ను నేను రేడియో కామెంట్రీలో విన్నా. అప్పుడు ఫరూక్ ఇంజినీర్, గుండప్ప విశ్వనాథ్, అజిత్ వాడేకర్ తలా కొన్ని పరుగులు సాధించారు. అప్పుడు టీమ్‌ఇండియా సిరీస్ గెలవడం సంచలనంగా మారింది. దాంతో విదేశాల్లో ఎక్కడైనా గెలుస్తామనే ధీమా కలిగించింది. ఇక ఇంగ్లాండ్‌లో గెలవడం అనేది చారిత్రక ఘట్టం. ఇది జరిగి అప్పుడే 50 ఏళ్లు గడిచాయి. నాటి క్రికెటర్లు ఒక ఒరవడి సృష్టించారు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్" అంటూ శాస్త్రి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.