క్రికెట్లో కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అభిమానుల మనసుల్లో చెరిగిపోని రికార్డులుగా మిగిలిపోతాయి. అవి గుర్తొస్తే అలాంటివి మరోసారి జరిగితే బాగుండని అనిపిస్తుంటుంది. ఇలాంటి అరుదైన ఘనతల్లో యువరాజ్ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సర్లు(Yuvraj Singh 6 Sixes) ఘనత ఒకటి. ఈ క్రికెటర్ గుర్తొస్తే మనకు ముందుగా కళ్లముందు మెదిలేది ఆరు సిక్సర్లే. అందుకే యువీని సిక్సర్ల కింగ్ అని ముద్దుగా పిలుస్తుంటారు!
సరిగ్గా 14 ఏళ్ల క్రితం (సెప్టెంబర్ 19) టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(Yuvraj Singh T20 World Cup 2007) ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లోని ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది ప్రత్యర్థికి పీడకల మిగిల్చాడు.
ఈ మ్యాచ్‌లో యువీ సంచలన ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానులను అలరించాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకముందు గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (ఇండియా), గిబ్స్ (దక్షిణాఫ్రికా)లు మాత్రమే ఈ మార్క్‌ను అందుకున్నారు.