RAHUL DRAVID: దక్షిణాఫ్రికాతో ఆదివారం నుంచి (డిసెంబరు 26) నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సఫారీల గడ్డపై సిరీస్ సాధించాలంటే తుది జట్టులో పలు మార్పులు చేయాలని అన్నాడు. జట్టులో సీనియర్ ఆటగాళ్లున్నా.. జట్టు ప్రయోజనాల కోసం కొందరిని పక్కన పెట్టక తప్పదని చెప్పాడు.
'తొలి టెస్టులో ఎవరెవరిని ఆడించాలనే విషయంపై మాకు పూర్తి స్పష్టత ఉంది. కొన్నిసార్లు జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అజింక్య రహానె, పుజారాలతో పాటు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. తిరిగి ఫామ్ అందుకోవడానికి రహానె నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే, తొలి టెస్టుకు అజింక్య రహానె, ఇషాంత్ శర్మల్లో ఎవరో ఒకరినే తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇద్దరిలో ఎవరిని పక్కన పెడతామనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. టాస్ తర్వాతే తుది జట్టును ప్రకటిస్తాం. దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడటం చాలా కష్టం. ప్రత్యేకించి సెంచూరియన్‌లో కఠిన సవాళ్లు ఎదురవుతుంటాయి. మొదటి టెస్టులో గెలిస్తే ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టొచ్చు. దక్షిణాఫ్రికాతో పోల్చుకుంటే భారత పేస్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. అయినా వారిని తేలిగ్గా తీసుకోం. మా బౌలర్లు 20 వికెట్లు తీసినా.. బ్యాటర్లు కూడా మెరుగైన స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు గాయాల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కావడం వల్ల బౌలింగ్ విభాగంలో సమతూకం లోపించింది. ఒకవేళ ఐదుగురు బౌలర్లతో ఆడాలనుకుంటే.. శార్ధూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్/హనుమ విహారిల్లో ఎవరినో ఒకరిని మాత్రమే తుది జట్టులోకి తీసుకుంటేనే శార్ధూల్‌కు చోటు దక్కుతుంది’ అని కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.