Indw Vs Ausw 3rd ODI Deepti Sharma :మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వాంఖడే వేదికగా టీమ్ఇండియాతో మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బౌలర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది.
ఈ మ్యాచ్‌లో కీలకమైన లిచ్‌ఫీల్డ్ వికెట్ తీసింది దీప్తి. దీంతో మహిళల వన్డేల్లో 100 వికెట్లు (86వ మ్యాచ్‌లో) తీసిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. గతంలో జులన్ గోస్వామి (255 వికెట్లు), నీతూ డేవిడ్ (97 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు), అల్ ఖదిర్ (78 మ్యాచ్‌ల్లో 100) భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్ల మార్కును తాకారు.
ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు టీమ్ఇండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి పేరిట ఉంది. గోస్వామి 204 వన్డేల్లో 255 వికెట్లు తీసి ఈ విభాగంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. వన్డే క్రికెట్‌లో 200కుపైగా వికెట్లు తీసిన ఏకైక బౌలర్ కూడా గోస్వామినే కావడం విశేషం.
నామమాత్రంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో అదరగొట్టింది. మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా సత్తా చాటింది. ఆఖర్లో ఆష్లే గార్డ్‌నర్ (30), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించింది. అమన్‌జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా.. ఆసీస్ బౌలర్ల ధాటికి 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధన (29), రిచా ఘోష్ (19), జెమీమా రోడ్రిగెజ్ (25), దీప్తి శర్మ (25 నాటౌట్), పూజా వస్త్రాకర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రస్తుత భారత పర్యటనలో ఆసీస్ తదుపరి టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ నవీ ముంబయి వేదికగా జరుగనున్నాయి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది భారత్.
టీ20 వరల్డ్‌కప్ జట్టు ఎంపిక కోసం బీసీసీఐ తీవ్ర కసరత్తులు- రోహిత్, కోహ్లీతో చర్చలు!
సమమా? సమర్పణమా?- సఫారీలతో రెండో టెస్ట్‌కు భారత్ రెడీ- తుది జట్ల వివరాలివే!