తెలంగాణ

telangana

ETV Bharat / sports

INDvsENG: కోహ్లీసేన ఆలౌట్.. ఇంగ్లాండ్ ఆధిక్యంలో - భారత్ ఇంగ్లాండ్ విరాట్ కోహ్లీ

మూడో టెస్టులో టీమ్‌ఇండియా 78 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్ 120 పరుగులు చేసి, తొలిరోజు ఆట ముగించింది. అయితే భారత బ్యాట్స్​మెన్ ఒక్కరంటే ఒక్కరు కూడా తొలి ఇన్నింగ్స్​లో కనీసం 20 పరుగులు చేయలేకపోయారు.

.
.

By

Published : Aug 25, 2021, 7:28 PM IST

Updated : Aug 26, 2021, 6:25 AM IST

బంతి స్వింగవడం.. బ్యాట్‌ను ముద్దాడడం.. వికెట్‌ కీపర్‌ బట్లర్‌ చేతుల్లో పడడం.. మళ్లీ మళ్లీ ఇదే దృశ్యం! వికెట్‌ పడుతున్న ప్రతిసారీ ఇది లైవా.. రీప్లేనా అన్న సందేహం! అసలు బ్యాటింగే రానట్లు.. క్రీజులో నిలవడమే తెలియనట్లు.. ఒకరి తర్వాత ఒకరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పేలవంగా ఆడి వెనుదిరుగుతుంటే.. లార్డ్స్‌ విజయోత్సాహమంతా చల్లారిపోయింది. పరిస్థితుల్ని, పిచ్‌ను ఎంతమాత్రం నిందించడానికి వీల్లేదని కాసేపటికే ఇంగ్లాండ్‌ ఓపెనర్లు తమ ఆటతో చాటిచెప్పారు. భారత జట్టంతా కలిసి చేసిన పరుగులు 78 అయితే.. ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసి, మన బ్యాటింగ్‌ డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ పుంజుకోవాలంటే అద్భుతాలు జరగాల్సిందే.

.

అసాధారణ ప్రదర్శనతో.. ప్రతికూల పరిస్థితుల్లో నుంచి గొప్పగా పుంజుకుని ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించిన టీమ్‌ఇండియా మూడో టెస్టును అత్యంత పేలవంగా మొదలెట్టింది. గత మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో గెలిచిన జట్టు ఇదేనా అనే అనుమానం కలిగిలే భారత బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు. తుస్సుమన్న టాప్‌ ఆర్డర్‌.. నిలబడని మిడిలార్డర్‌.. ప్రతిఘటించని లోయర్‌ఆర్డర్‌.. వెరసి బుధవారం ఆరంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 78 పరుగులకే కుప్పకూలింది. 105 బంతులాడి 19 పరుగులు చేసిన రోహితే టాప్‌స్కోరర్‌. అతనితో పాటు రహానె (18) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ట్రాలే (16) అత్యధికం. అండర్సన్‌ (3/6), ఒవర్టన్‌ (3/14) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ ఆట ముగిసే సమయానికి 120/0తో నిలిచింది. ఓపెనర్లు బర్న్స్‌ (52 బ్యాటింగ్‌; 125 బంతుల్లో 5×4, 1×6), హమీద్‌ (60 బ్యాటింగ్‌; 130 బంతుల్లో 11×4) క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు.

.

టపటపా: పాతిక పరుగులైనా రాలేదు.. కానీ అప్పటికే ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు.. 30 ఓవర్లన్నా పూర్తవలేదు.. అప్పటికే సగం వికెట్లు కూలాయి.. ఆఖర్లో అయిదు ఓవర్ల వ్యవధిలోనే మిగతా అయిదుగురు ఆటగాళ్లూ ఔటైపోయారు.. ఇదీ క్లుప్తంగా టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ సాగిన తీరు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (0)ను తొలి ఓవర్లోనే వెనక్కిపంపి భారత పతనాన్ని ఆరంభించిన అండర్సన్‌.. తన స్వింగ్‌ బౌలింగ్‌తో పుజారా (1), కోహ్లి (7)ని బుట్టలో వేసుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా 21/3తో కష్టాల్లో పడింది. ఇది జట్టుకు ఊహించని ఆరంభమే. పదునైన బంతులతో విజృంభించిన అండర్సన్‌ వేసిన ప్రతి బంతీ బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టింది. ఆ దశలో ఓ వైపు క్రీజులో కుదురుకున్న రోహిత్‌ (19)కు రహానె (18) జత కలిశాడు. వీళ్లిద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తూ 15 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. జోరుమీదున్న ప్రత్యర్థి బౌలర్లను కాచుకునేందుకు తన సహజ శైలికి విరుద్ధంగా ఆడిన రోహిత్‌ క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. రహానె కూడా ఉత్తమంగా ఆడుతుండడంతో భారత్‌ కోలుకునేలా కనిపించింది. కానీ లంచ్‌ విరామానికి ముందు చివరి బంతికి రహానెను ఔట్‌ చేసిన రాబిన్సన్‌ (2/16) ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పాడు. రెండో సెషన్‌లో భారత ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు బాధ్యతాయుతంగా ఆడాల్సిన పంత్‌ (2) నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ సమర్పించుకోవడం జట్టును మరింత దెబ్బతీసింది. జడేజా (4)తో కలిసి రోహిత్‌.. జట్టును ఆదుకుంటాడేమోననుకున్న ఆశలు నెరవేరలేదు. ఆరు బంతుల వ్యవధిలోనే రోహిత్‌తో సహా నాలుగు వికెట్లు పడగొట్టిన ప్రత్యర్థి పేసర్లు టీమ్‌ఇండియాను గట్టి దెబ్బ కొట్టారు. జట్టు 67 పరుగుల వద్దే ఆ నాలుగు వికెట్లు కూలాయి. అప్పటివరకూ ఓపికగా ఆడిన రోహిత్‌.. ఒవర్టన్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమై పేలవ రీతిలో నిష్క్రమించాడు. ఆ వెంటనే షమి (0).. సామ్‌ కరన్‌ (2/27) వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో జడేజా, బుమ్రా (0) ఔటయ్యారు.

1

ఓ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క భారత బ్యాట్స్‌మెన్‌ కూడా కనీసం 20 పరుగులు చేయకపోవడం ఇదే మొదటిసారి.

78

గత 34 ఏళ్లలో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆటలో భారత్‌ నమోదు చేసిన అత్యల్ప స్కోరిది. చివరగా 1987లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా.. తొలి రోజు 75 పరుగులకే ఆలౌటైంది.

3

ఇంగ్లాండ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. దీని కంటే ముందు 42 (1974లో లార్డ్స్‌లో), 58 (1952లో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో) పరుగుల ఇన్నింగ్స్‌లున్నాయి.

Last Updated : Aug 26, 2021, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details