Mithali Raj retirement: మహిళల క్రికెట్ మేటి.. భారత టెస్టు, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ఆటకు టాటా చెప్పింది. 23 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతూ.. అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడిన 39 ఏళ్ల మిథాలీ 232 వన్డేల్లో 7805 పరుగులు చేసింది. ఆమె 89 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడింది. కేవలం 12 టెస్టులే ఆడినా.. ఓ డబుల్ సెంచరీ చేసింది. ఆ ఘనత సాధించిన ఏకైక భారత మహిళ మిథాలీనే. ఆమె 2019లో టీ20 క్రికెట్ నుంచి రిటైరైంది. వన్డే ప్రపంచకప్ అనంతరం వీడ్కోలు పలుకుతా అని మిథాలీ ముందే చెప్పింది. మార్చిలో జరిగిన ఆ ఈవెంట్లో ఆమె జట్టుకు నాయకత్వం వహించింది.
స్వస్థలం రాజస్థానే అయినా హైదరాబాదీగానే అందరికీ తెలిసిన మిథాలీ.. రెండు దశాబ్దాల పాటు గొప్పగా రాణించి భారత క్రికెట్లో దిగ్గజ హోదాను అందుకుంది. 1999లో ఆమె అరంగేట్రం చేసినప్పుడు మహిళల క్రికెట్ గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ లక్షలాది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారంటే అది మిథాలి ఇచ్చిన స్ఫూర్తే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ‘‘మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ జట్టును గెలిపించడం కోసం నా అత్యుత్తమ ఆట ఆడా. దేశం తరఫున ఆడేందుకు లభించిన ఈ అవకాశం నాకు ఎప్పటికీ ఓ మధుర స్మృతిగా ఉండిపోతుంది’’ అని తన ప్రకటనలో మిథాలీ పేర్కొంది. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పింది. ‘‘నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని భావించా. ఎందుకంటే జట్టు ఇప్పుడు సమర్థులైన, ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల చేతుల్లో ఉంది. భారత క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది’’ అని మిథాలీ వివరించింది.
అదో గొప్ప గౌరవం: సుదీర్ఘకాలం భారత జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని మిథాలీ రాజ్ చెప్పింది. ‘‘భారత జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం. అది వ్యక్తిగా నేను ఎదగడానికి ఉపకరించింది. భారత మహిళల క్రికెట్ ఎదుగుదలకు కూడా ఉపయోపడిందని భావిస్తున్నా’’ అని ఆమె తెలిపింది.
మిథాలీ సారథ్యంలోని భారత జట్టు వరుసగా నాలుగు ఆసియా కప్ టైటిళ్లు సాధించింది. 2005-06, 2006-07, 2008, 2012లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. ఇక టెస్టుల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. 2014లో ఇంగ్లాండ్‌లో భారత్‌కు ప్రత్యర్థిపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని అందించింది.
బ్లూ జెర్సీని ధరించాలనే తపనతో చిన్నప్పుడు ప్రయాణం మొదలెట్టా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. ప్రయాణంలో ఎన్నో ఎత్తులు, పల్లాలు. ప్రతి ఈవెంటూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పింది. గత 23 ఏళ్లు ఎంతో సంతృప్తికరంగా సాగాయి. సవాళ్లతో కూడిన ప్రయాణాన్ని ఆస్వాదించా. కానీ అన్ని ప్రయాణాల లాగే ఇది కూడా ముగియాలి. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైరవుతున్నా.
- మిథాలీ రాజ్
అటు సచిన్.. ఇటు తను..మహిళా క్రికెట్లో సచిన్ అని మిథాలీని పిలుస్తారు. దాదాపు 23 ఏళ్ల కెరీర్‌లో ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. సచిన్‌లాగే జట్టు కోసం ఎంతో చేసింది. ఇంకా చెప్పాలంటే.. సచిన్‌కు సాధ్యం కాని రికార్డులూ అందుకుంది. అందులో ముఖ్యంగా కెప్టెన్సీ గురించి చెప్పుకోవాలి. మిథాలీ సారథిగా జట్టును అద్భుతంగా నడిపించింది. అసాధ్యం అనుకున్న విజయాలను అందించింది. కెప్టెన్‌గానే ఆటకు వీడ్కోలు పలికింది. కానీ సచిన్ నెరవేర్చుకున్న ఓ కలను మాత్రం మిథాలీ అందుకోలేకపోయింది. అదే ప్రపంచకప్. చివరి వరకూ ప్రపంచకప్ వేట కొనసాగించిన సచిన్.. తన ఆఖరి ప్రయత్నంలో ఆ స్వప్నాన్ని సాకారం చేసుకుని ఘనంగా ఆటకు గుడ్‌బై చెప్పాడు. కానీ ప్రపంచకప్ కోసం అలుపెరగని పోరాటం చేసిన మిథాలీ తన గమ్యాన్ని చేరుకోలేకపోయింది.
ఆరు ప్రపంచకప్‌లు.. మిథాలీ రాజ్ ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడింది. ఈ టోర్నీలో వరుసగా ఏడు అర్ధశతకాలు సాధించిన రికార్డు ఆమె సొంతం. రెండు ప్రపంచకప్పుల్లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ఏకైక (పురుషులు లేదా మహిళలు) భారత క్రికెటర్ ఆమెనే. ఆమె నాయకత్వంలో భారత్ 2005, 2017 ప్రపంచకప్పుల్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 2017 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన దేశంలో మహిళల క్రికెట్‌కు గొప్ప ఊతాన్నిచ్చింది.
టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన భారత ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు మిథాలీ పేరిట ఉంది. 2014-17 ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో ఆమె 17 మ్యాచ్‌ల్లో 535 పరుగులు చేసింది. 16 ఏళ్ల వయసులో 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం (23 ఏళ్లు) కొనసాగిన క్రికెటర్‌గా నిలిచింది.
అత్యధిక పరుగుల రికార్డు ఆమెదే..మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రికార్డు మిథాలీ రాజ్ సొంతం ఆమె. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి 10868 పరుగులు సాధించింది. ఎడ్వర్డ్స్ (10,273), మిథాలీ మాత్రమే మహిళల క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్లు
వన్డేల్లో అత్యధిక స్కోరర్..మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ మిథాలీ రాజే. ఆమె 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించింది. రెండో స్థానంలో ఉన్న ఎడ్వర్డ్స్ ఆమె కన్నా 1813 పరుగులు తక్కువ చేసింది. టాప్-7 బ్యాటర్లలో మిథాలీకి మాత్రమే 50కి పైగా సగటు ఉంది. మిథాలీ టీ20ల్లో భారత్ తరఫున టాప్ స్కోరర్. ఆమె 2364 పరుగులు చేసింది.
అరంగేట్రంలో శతకం..మిథాలీ 1999లో వన్డే అరంగేట్రంలోనే శతకం సాధించింది. 16 ఏళ్ల 205 రోజుల వయసులో ఐర్లాండ్‌పై 114 పరుగులతో అజేయంగా నిలిచింది. 2021లో అమీ హంటర్ (ఐర్లాండ్) తన 16వ పుట్టిన రోజున శతకం చేసే వరకు అతి పిన్న వయసు సెంచూరియన్‌గా మిథాలీనే ఉంది.
28...ప్రపంచకప్పుల్లో మిథాలీ నాయకత్వం వహించిన మ్యాచ్‌లు. ఇది రికార్డు.
89.. కెప్టెన్‌గా 155 వన్డేల్లో మిథాలీ రాజ్ సాధించిన విజయాలు. మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌ల్లో గెలిచిన సారథి ఆమెనే. అత్యధిక వన్డేల్లో సారథ్యం వహించిన ఘనత కూడా మిథాలీదే.
232.. మిథాలీ ఆడిన వన్డేల సంఖ్య. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్ ఆమెనే. మిథాలీ కాకుండా జులన్ గోస్వామి మాత్రమే 200పై వన్డేలు ఆడింది.
అలా మొదలైంది..
తొలి వన్డే- 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో (114 నాటౌట్)
తొలి టెస్టు- 2002 జనవరి 14- 17 ఇంగ్లాండ్‌తో (0)
తొలి టీ20- 2006 ఆగస్టు 5న ఇంగ్లాండ్‌తో (28)
‘‘భారత జట్టుకు ఆడాలన్న కలను కొందరే నెరవేర్చుకోగలరు. అలాంటిది 23 ఏళ్లు దేశానికి ఆడడం చాలా గొప్ప విషయం. నువ్వు భారత క్రికెట్‌కు మూల స్తంభంలా ఉన్నావు. ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచావు. నీకు అభినందనలు’’