Harman Preet Kaur Career:పంజాబ్‌లోని మోగా హర్మన్ సొంతూరు. తండ్రి హర్మందర్. రాష్ట్రస్థాయి వాలీబాల్, బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. ఆపైన జిల్లా కోర్టులో క్లర్క్‌గా స్థిరపడ్డారు. పిల్లల్నైనా క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనుకుని హర్మన్, ఆమె తమ్ముడు గుర్జీందర్‌లను ప్రోత్సహించారు. వాలీబాల్, హాకీ, ఫుట్‌బాల్.. అన్నీ ఆడించేవారు. హర్మన్ మాత్రం క్రికెట్ ఎంచుకుంది. వీరేంద్ర సెహ్వాగ్‌ను అనుకరించేది. అమ్మాయిలు లేకపోవడంతో గ్రౌండ్‌లో అబ్బాయిలతో కలిసి ఆడేది.
అక్కడే హర్మన్ ఆటని చూశారు కమల్‌దీష్ సోధీ. మోగాలో ప్రఖ్యాత జ్ఞాన్ జ్యోతి స్కూల్ యజమాని ఆయన. అతని కొడుకు యద్వీందర్ క్రికెట్ కోచ్. తమ స్కూల్లో హర్మన్‌ని చేర్పించి ఆమె కోసం అమ్మాయిల క్రికెట్ జట్టుని తయారుచేశారు సోధీ. షూస్ నుంచి క్రికెట్ కిట్ వరకూ అన్నీ కొనిచ్చారు. యద్వీందర్ శిక్షణలో రాటుదేలిన హర్మన్ 2009లో భారత జట్టుకి ఎంపికైంది. 20 ఏళ్లకే జాతీయ జట్టులో స్థానం అంటే జీవితం మారిపోయినట్టేగా. కానీ హర్మన్ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే తను ఎంపికైంది మహిళల జట్టుకి!
ఇంట్లోవాళ్లకి భారమవడం ఇష్టం లేక ఉద్యోగం సంపాదించాలనుకుంది హర్మన్. తన కోచ్ సాయంతో పంజాబ్ ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడితే 'మహిళా క్రికెటర్లకీ ఉద్యోగం అంటే ఎలా' అన్న బదులొచ్చింది. లాభం లేదని ఇష్టంలేకపోయినా ముంబయికి మకాం మార్చింది. మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సాయంతో సచిన్ తెందుల్కర్ సిఫార్సుతో పశ్చిమ రైల్వేలో 'చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్'గా 2014లో ఉద్యోగం సంపాదించింది. ఉండటానికి క్వార్టర్స్ దొరికినా ఒక పూట ఆఫీసుకి వెళ్లడం తప్పనిసరి. ఉదయాన్నే ఓ గంట క్రికెట్ ప్రాక్టీసు ముగించుకుని లోకల్ రైల్లో ఆఫీసుకి చేరుకునేది. ఒంటిగంట వరకూ ఉద్యోగ బాధ్యతలు.. సాయంత్రం ప్రాక్టీసు. గ్రౌండ్‌లో అమ్మాయిలకు పరిమితంగా సమయం ఇచ్చేవారు.