ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టు(India T20 WC Team)ను బీసీసీఐ సెలక్టర్ల బృందం (BCCI selection committee) ఎంపిక చేసిందని సమాచారం. బహుశా సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం జట్టును ప్రకటిస్తారని తెలిసింది. చేతన్ శర్మ నేతృత్వంలోని ఎంపిక కమిటీ నాలుగో టెస్టుకు ముందే కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో సమావేశమైందట. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొందరి స్థానాల గురించి చర్చించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
నాలుగో టెస్టు ఫలితం తర్వాతే..
ఇప్పటికే జట్టు ఎంపిక పూర్తైందని తెలిసింది. నాలుగో టెస్టు ఫలితం త్వరగా తేలితే సోమవారం సాయంత్రమే జట్టును ప్రకటిస్తారు. ఆలస్యమైతే మంగళవారం ఉదయం ప్రకటిస్తారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఎవరెవరిని ఎంపిక చేయాలి? ఏ స్థానాల్లో ఎవరిని ఆడించాలన్న అంశాలపై నాలుగో టెస్టుకు ముందే కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది.
ఐసీసీ 15 మందికే రీయింబర్స్ చేస్తున్నా బీసీసీఐ మాత్రం అదనంగా మరో ఐదుగురిని ఎంపిక చేయనుంది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్త పడుతోంది. ఐపీఎల్ బుడగ నుంచి ప్రపంచకప్ బుడగకు వీరంతా బదిలీ అవుతారు. ఇంగ్లాండ్, శ్రీలంక పర్యటనలకూ బీసీసీఐ జంబో జట్లనే ఎంపిక చేసింది.