ఇష్ సోధి, అజాజ్ పటేల్.. ఈ పేర్లు చూస్తే ఇద్దరూ భారతీయులని సులువుగా చెప్పేయొచ్చు. కానీ వీళ్లిద్దరూ రాబోయే టెస్టు సిరీస్‌లో(IND vs NZ Test Series 2021) భారత జట్టుకు సవాలు విసరబోతున్నారు. న్యూజిలాండ్ జట్టు స్పిన్ విభాగంలో వీళ్లిద్దరూ కీలకం కాబోతున్నారు. రెండు టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు వేదిక కానున్న కాన్పూర్‌లోని పిచ్ సాధారణంగానే స్పిన్నర్లకు అనుకూలం. ఈ మ్యాచ్‌కు మరింతగా స్పిన్నర్లకు సహకరించేలా పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్ పిచ్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పక్కా ప్రణాళికతోనే వస్తోంది.
టీ20 సిరీస్‌లో సత్తా చాటిన శాంట్నర్, ఇష్ సోధిలతో పాటు అజాజ్ పటేల్‌ను కూడా బరిలోకి దించడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. తాము ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పడం విశేషం. ఇదే నిజమైతే భారత్‌తో మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన ఇద్దరు స్పిన్నర్లు ప్రత్యర్థి జట్టుకు ఆడటం ప్రత్యేకమే.
ఇద్దరూ ఒకేలా..
ఇష్(Ish Sodhi News), అజాజ్‌లిద్దరి(Ajaz Patel news) నేపథ్యాలు దాదాపు ఒకలాంటివే. పంజాబ్‌లోని లుధియానాలో పుట్టిన ఇష్.. చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడ్డాడు. యూత్ స్థాయిలో ఆక్లాండ్‌లో క్రికెట్ ఆరంభించి.. తన లెగ్ స్పిన్‌తో సత్తా చాటుకుని న్యూజిలాండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అతను నేరుగా టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగట్రేం చేయడం విశేషం. 2013లో తొటి టెస్టు ఆడిన ఇష్.. ఆ తర్వాతి రెండేళ్లలో టీ20లు, వన్డేల్లోనూ అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్రం చేసింది టెస్టుల్లో అయినా.. టీ20ల్లోనే అతను ఎక్కువ ప్రభావం చూపాడు. 29 ఏళ్ల ఇష్ ఇప్పటిదాకా 17 టెస్టుల్లో 41, 33 వన్డేల్లో 43, 66 టీ29ల్లో 83 వికెట్లు పడగొట్టాడు. లోయరార్డర్లో అప్పుడప్పుడూ ఇష్ ఉపయుక్తమైన పరుగులూ చేస్తుంటాడు. టెస్టుల్లో అతను 21.23 సగటుతో 448 పరుగులు చేయడం విశేషం.