తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ క్రికెటర్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసా?

క్రికెట్​.. భారత్​లో ఆట మాత్రమే కాదు ఓ మతం. ఆటను ఎంతగా అభిమానిస్తారో, ఆటగాళ్లను అంతకుమించి ఆరాధిస్తారు. మ్యాచ్​ జరుగుతుంటే కోట్లాది మంది వారికి మద్దతుగా నిలుస్తారు. అభిమాన ఆటగాడి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. ఎంతో పేరుపొందిన టీమ్​ఇండియా క్రికెటర్ల భార్యలు ఏం చేస్తుంటారో ఇందులో చూద్దాం.

Indian cricketer wives and their Professionsa
ఈ క్రికెటర్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసా?

By

Published : May 14, 2021, 10:18 AM IST

ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో సమరం కోసం దేశాలు, ఖండాలు దాటి పయనిస్తుంటారు. కుటుంబం కంటే ఎక్కువగా డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే గడుపుతుంటారు. ఏడాది అంతా తీరికలేని షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉంటుంటారు. ఈ సమయంలో కాస్త విరామం దొరికినా తమ ప్రేయసి, భార్యలతో సరదాగా గడిపేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎవరెవరి భార్యలు ఏం చేస్తుంటారో ఓ సారి చూద్దాం.

సంజనా గణేశన్

టీమ్‌ఇండియా అగ్రశ్రేణి పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఓ క్రీడా ఛానెల్‌లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజనా గణేశన్‌ను అతను వివాహమాడాడు. మోడల్​గానూ రాణించిన సంజన తర్వాత యాంకర్ అవతారమెత్తింది. ప్రస్తుతం బ్యాడ్మింటన్, టెన్నిస్​తో పాటు క్రికెట్​ మ్యాచ్​లకూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

బుమ్రా, సంజన

సాక్షి సింగ్​ ధోనీ

టీమ్​ఇండియా కెప్టెన్​గా జట్టుకు ఎన్నో రికార్డు విజయాలు అందించిన క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ. అతని భార్య సాక్షి. హోటల్​ మేనేజ్​మెంట్ విద్యలో పట్టభద్రురాలు. మహీని పెళ్లాడకముందు కోల్​కతాలోని తాజ్​ బెంగాల్​ హోటల్​లో ట్రైనీగా పనిచేసేవారు. వీరిద్దరికీ 2010 జులై 4న వివాహమైంది. వీరికి జీవా అనే కూతురుంది. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన విషయాలను చూసుకుంటూ బిజీగా గడిపేస్తోంది సాక్షి.

ధోనీ, సాక్షి

అనుష్క శర్మ

ప్రస్తుత టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ. బాలీవుడ్​లో స్టార్​ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న అనుష్క.. వివాహం తర్వాత సినిమాల్లో కొనసాగుతున్నారు. వెబ్​సిరీస్​లకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

కోహ్లీ, అనుష్క

రితికా సజ్దే

భారత జట్టు ఓపెనర్​ రోహిత్ ​శర్మ భార్య రితికా సజ్దే. ఈమె స్పోర్ట్స్​ మేనేజర్​. అంటే ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం, స్పోర్ట్స్​ ఈవెంట్లు, మ్యాచ్​లు నిర్వహిస్తూ ఉంటారు. క్రికెట్​తో పాటు పలు క్రీడలపై రితికకు మంచి అవగాహన ఉంది. వీరిద్దరికీ సమైరా అనే పాప ఉంది.

రితికా, రోహిత్

హెజిల్ కీచ్

లెఫ్ట్ ​హ్యాండ్​​ బ్యాట్స్​మన్​, హార్డ్​ హిట్టర్​ యువరాజ్​ సింగ్​ సతీమణి హెజెల్ కీచ్. బాలీవుడ్​లో నటిగా రాణించిన హెజెల్​.. 'ఆ అంటే అమలాపురం' పాటలో నర్తించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2016 నవంబర్​ 30న వీరిద్దరి వివాహం జరిగింది.

యువరాజ్, హెజిల్ కీచ్

గీతా బస్రా

స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ భార్య గీతా బస్రా. బాలీవుడ్​లో ఇమ్రాన్​ హష్మీ పక్కన 'దిల్​ దియా హై' సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ద ట్రైన్'​, 'జిల్లా ఘజియాబాద్'​, 'సెకండ్​ హ్యాండ్​ హజ్బెండ్​'​ వంటి చిత్రాల్లో నటించారు. 2015లో వివాహం చేసుకున్న ఈ జోడికి హినయ హీర్​ అనే కూతురు ఉంది.

హర్భజన్, గీత

ప్రియాంకా చౌదరి

భారత లెఫ్ట్​హ్యాండ్​ బ్యాట్స్​మన్​ సురేశ్​ రైనా సతీమణి ప్రియాంకా చౌదరి. ఈ ఆటగాడిని పెళ్లాడక ముందు నెదర్లాండ్స్​లో ఐటీ ఉద్యోగినిగా పనిచేసేవారు. చిన్ననాటి నుంచే వీరిద్దరూ స్నేహితులు కాగా.. కొన్నేళ్ల ప్రేమ తర్వాత 2015లో వివాహం చేసుకున్నారు. 2016, మే 14న వీరిద్దరికీ ఓ పాప జన్మించింది. ఆమె పేరు గ్రేసియా రైనా.

రైనా, ప్రియాంక

విజేతా పెందార్కర్

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​, జాతీయ క్రికెట్​ అకాడమీ ఛైర్మన్​ అయిన రాహుల్​ ద్రవిడ్​ భార్య విజేత. మిస్టర్​ డిపెండబుల్​గా పేరున్న ఇతడి సతీమణి మెడికల్​ సర్జన్​గా పనిచేసేవారు. వీరికి సమిత్​, అన్వయ్​ అనే ఇద్దరు తనయులు ఉన్నారు. సమిత్​ ఇప్పటికే జూనియర్​ స్థాయి క్రికెట్​లో మంచి పేరు తెచ్చుకున్నాడు.

విజేత, ద్రవిడ్

దీపికా పల్లికల్

భారత సీనియర్​ క్రికెటర్​ దినేశ్​ కార్తీక్​ సతీమణి దీపికా పల్లికల్. భారత స్వ్కాష్​ ప్లేయర్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పీఎస్​ఏ మహిళల ర్యాంకింగ్స్​లో టాప్​-10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా అరుదైన రికార్డు ఈమె సొంతం. అర్జున అవార్డు కైవసం చేసుకున్న మొదటి భారత మహిళా స్వ్కాష్​ ప్లేయర్​గా ఘనత సాధించారు. 2015 ఆగస్టు 18న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

కార్తీక్, దీపికా పల్లికల్

అంజలీ తెందూల్కర్

భారత క్రికెట్​ దిగ్గజం, మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ సతీమణి అంజలి. శిశు వైద్యురాలు(పీడియాట్రిషియన్​) అయిన అంజలి.. సచిన్​ను వివాహం చేసుకున్నాక కెరీర్​ను విడిచిపెట్టేశారు. వీరిద్దరికీ సారా, అర్జున్​ అనే పిల్లలున్నారు. అర్జున్​ ఇప్పటికే జూనియర్​ క్రికెట్​లో ఆడుతున్నాడు.

అంజలి, సచిన్

అయేషా ముఖర్జీ

భారత స్టార్​ ఓపెనర్​ శిఖర్​ ధావన్​ భార్య అయేషా. కిక్​ బాక్సర్​, అథ్లెట్​ అయిన ఈమె.. పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత ఆటలను వదిలేశారు. వీరికి జోరావర్​, రియా, అలియా అనే ముగ్గురు పిల్లలున్నారు.

ధావన్, అయేషా

డోనా గంగూలీ

భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ సతీమణి డోనా. ఒడిస్సీ నృత్యంలో ప్రావీణ్యురాలు. బంగాల్​లో పుట్టిన ఈమె దీక్ష మంజరీ అనే డ్యాన్స్​ ఇన్​స్టిట్యూట్​ను నడుపుతున్నారు. దీన్ని ప్రముఖ సింగర్​ లతా మంగేష్కర్​ ప్రారంభించారు. వీరికి సనా గంగూలీ అనే పాప ఉంది.

డోనా, గంగూలీ

మయాంతీ లాంగర్

భారత క్రికెటర్​ స్టువర్ట్​ బిన్నీ భార్య మయంతీ లాంగర్. క్రికెట్​ వ్యాఖ్యాత, జర్నలిస్ట్​గా ఈమెకు మంచి పేరుంది. 2010 ఫిఫా వరల్డ్​కప్, 2015 క్రికెట్​ వరల్డ్​కప్​ సహా 2010 కామన్వెల్త్​ గేమ్స్​, 2011 క్రికెట్​ వరల్డ్​ కప్​,2014 ఇండియన్​ సూపర్​లీగ్​లో తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను మెప్పించారు. స్టార్​ టీవీ ఛానెల్​లో ప్రసారమయ్యే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​లకు​ మయంతి యాంకర్​గా ఉన్నారు.

బిన్నీ, మయాంతి

ప్రీతి నారాయణన్

టీమ్​ఇండియా స్టార్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ సతీమణి ప్రీతి నారాయణన్. ఇంజినీర్​ అయిన ఈమె అశ్విన్​తో పాటు ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఈ జంటకు ఆద్య, అకిరా అనే ఇద్దరు పిల్లలున్నారు.

అశ్విన్, ప్రీతి

నుపుర్ నగర్

భారత పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ భార్య నుపుర్. ఇంజినీర్​ అయిన ఈమె నొయిడాలోని ఓ మల్టీనేషనల్​ సంస్థలో ఉద్యోగినిగా సేవలందించారు.

భువనేశ్వర్, నుపుర్

తాన్యా వాధ్వ

భారత యువ పేసర్​ ఉమేశ్​ యాదవ్​ సతీమణి తాన్యా. డిజైనర్​ అయిన ఈమెకు ఫ్యాషన్​ రంగంలో మంచి పట్టుంది.

కావ్య, ఉమేశ్

ABOUT THE AUTHOR

...view details