33* (18), 45 (27), 56* (22), 23(17), 108* (88).. ఇవీ శ్రీలంక సారథి డాసున్ శనక గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌పై గణాంకాలు.. ఇందులో తొలి నాలుగు టీ20లు కాగా.. సెంచరీ సాధించిన మ్యాచ్ తాజాగా జరిగిన వన్డే మ్యాచ్..
టీమ్ఇండియా బౌలర్లకు 'శనక' గండం.. మనోళ్లు జాగ్రత్త పడాల్సిందే!
భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో విజయం టీమ్‌ఇండియాదే అయినప్పటికీ.. లంక సారథి డాసున్ శనక మాత్రం హైలైట్‌గా నిలిచే ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలింగ్‌లో పూనకం వచ్చినట్లుగా ఈ ఆటగాడు ఆడేస్తున్నాడు.
టీమ్ఇండియా అంటేనే దూకుడు గుర్తుకొస్తుందో లేకపోతే.. గత ఐపీఎల్ మినీ వేలంలో కొనుగోలు చేయలేదనే కసితోనో.. భారత బౌలింగ్‌ను దంచికొడుతున్నాడు. అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్ వేసే టీమ్ఇండియా బౌలర్లు కూడా ఒక్కసారిగా వెనుకడుగు వేస్తున్నారు. ఆరో స్థానంలో వచ్చి ధాటిగా ఆడుతున్న శనక ఇంకాస్త ముందొస్తే మాత్రం ఎంతటి భారీ లక్ష్యం ఉంచినా.. ప్రత్యర్థి జట్లు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌పై గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో శనక మూడుసార్లు నాటౌట్‌గా నిలవడం విశేషం.
- గతేడాది ఆసియా కప్‌లో భారత్ x శ్రీలంక జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 173/8 స్కోరు సాధించింది. అయితే లంక ఓపెనర్లు రాణించడంతో 97/0తో ఉంది. కానీ భారత బౌలర్లు విజృంభించి స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి రేసులోకి వచ్చారు. అయితే కెప్టెన్ డాసున్ శనక మాత్రం బెదరకుండా.. ఆరు ఓవర్లలో 64 పరుగులు కావాల్సిన తరుణంలో చివరి వరకు క్రీజ్‌లో ఉండి మరీ లంకను విజయతీరాలకు చేర్చాడు.
- ఆసియా కప్ తర్వాతే ప్రపంచకప్‌లో ఇరు జట్లూ తలపడలేదు. కానీ 2023 కొత్త సంవత్సరంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్ జరిగింది. మూడు మ్యాచుల్లోనూ రాణించిన శనక.. రెండో టీ20లో మాత్రం విశ్వరూపం చూపించాడు. కేవలం 22 బంతుల్లోనే 56 పరుగులు సాధించి శ్రీలంక 206 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దాదాపు 69 మ్యాచ్‌ల తర్వాత శ్రీలంక స్కోరుబోర్డు రెండొందలు దాటింది. భారత్‌పై వేగవంతమైన అర్ధ శతకం సాధించిన రెండో బ్యాటర్‌గా డాసున్ శనక (20 బంతుల్లో) అవతరించాడు. ఐపీఎల్ మినీ వేలంలో తీసుకోకపోవడంతోనే ఇలా అదరగొట్టాడని నెట్టింట్లో వైరల్‌గా మారాడు.
- ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. మిగతా రెండు మ్యాచుల్లో అతడిని కట్టడి చేయకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీమ్‌ఇండియా దగ్గర (373/7) భారీ స్కోరు ఉంది కాబట్టి సరిపోయింది. అదే 330 పరుగుల్లోపు లక్ష్యం ఉంటే మాత్రం శనక హిట్టింగ్‌తో భారత్‌కు ఓటమి రుచి చూపించేవాడే.
- "నాన్‌స్ట్రైకర్ రనౌట్ ద్వారా శనకను ఔట్ చేయాలని అనుకోలేదు. మరోలా పెవిలియన్‌కు చేర్చాలని భావించాం. అయితే అతడు అద్భుతంగా ఆడాడు" - ఇదీ తొలి వన్డే అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు. రనౌట్ సమయంలో శనక 98 పరుగుల వద్ద ఉన్నాడు. భారత్ అప్పీలు వెళ్లకపోవడంతో బతికిపోయిన శనక సెంచరీ పూర్తి చేశాడు. అయితే రోహిత్ చెప్పినట్లు అలా కాకపోయినా.. అతడిని ఎలా ఔట్ చేయాలనేదానిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.