తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో వన్డేలోనూ భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్​ను కైవసం చేసుకుంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 20, 2022, 6:27 PM IST

Updated : Aug 20, 2022, 6:36 PM IST

జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలోనూ దూకుడు ప్రదర్శించింది. ఆతిథ్య జట్టును గత మ్యాచ్​లో కంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. అయితే, తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేయగా.. తాజాగా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

టాస్ నుంచి తొలి ఇన్నింగ్స్ ముగిసేంత వరకు తొలి వన్డేను తలపించేలా గేమ్ సాగింది. టాస్ నెగ్గిన సారథి కేఎల్ రాహుల్.. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించాడు. నిదానంగా బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే.. తొమ్మిదో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి క్రమంగా వికెట్లు చేజార్చుకుంది. గత వన్డేలో 190కి పైగా స్కోరు నమోదు చేసిన ఆ జట్టు.. ఈ సారి 161 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లంతా కట్టుదిట్టంగా బంతులేశారు. శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించాడు. సిరాజ్, ప్రసిద్ధ్, అక్షర్, కుల్దీప్, దీపక్ హుడా ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్.. కాస్త తడబడింది. గాయం నుంచి కోలుకొని సుదీర్ఘ విరామం తర్వాత బ్యాటింగ్​కు దిగిన సారథి కేఎల్ రాహుల్.. ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. అయితే, మూడో స్థానంలో వచ్చిన శుభ్​మన్ గిల్(33)​తో కలిసి శిఖర్ ధావన్(33) స్కోరు బోర్డును నడిపించాడు. దూకుడుగా ఆడుతున్న ధావన్​ను చివాంగ వెనక్కి పంపించాడు. ఇషాన్ కిషన్(6) విఫలం కాగా దీపక్ హుడా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. చివర్లో సంజూ శాంసన్ మెరుపులు మెరిపించాడు. సిక్సులు, ఫోర్లు దంచికొట్టాడు. దీంతో భారత్ 5 వికెట్ల తేడాతో మ్యాచ్​ను చేజిక్కించుకుంది. తాజా విజయంతో సిరీస్ 2-0తో భారత్ వశమైంది. ఆగస్టు 22న మూడో వన్డే జరగనుంది.

Last Updated : Aug 20, 2022, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details