తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరో 3 రోజుల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌.. ఇక ఆసీస్‌ను ఆపగలరా? - మహిళల టీ20 ప్రపంచకప్‌ 2023 టీమ్​ ఇండియా

అది 2009.. మొట్టమొదటి మహిళల టీ20 ప్రపంచకప్‌.. టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపించిన ఆ జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించింది. ఓటమి భారంతో ఇంగ్లాండ్‌ నుంచి స్వదేశం బాట పట్టిన ఆ జట్టు.. కసితో రగిలింది. ఆటను మెరుగుపర్చుకుని.. ప్రత్యర్థులకు అందని విధంగా ఎదిగింది. రెండో ప్రపంచకప్‌ మొదలు.. వరుసగా ఆరు ప్రపంచకప్‌ల్లోనూ ఫైనల్‌ చేరింది. అందులో అయిదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. అదే.. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు. ఇప్పుడు మరోసారి కప్పుపై కన్నేసిన ఈ కంగారూ జట్టుకు ఎదురుందా? ఆసీస్‌ అమ్మాయిలను ఆపి.. మరో జట్టు కప్పును ముద్దాడుతుందా? అన్నది చూడాలి.

T20 Worldcup 2022
icc womens t20 world cup

By

Published : Feb 7, 2023, 11:09 AM IST

వేదిక ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా పరిస్థితులు ఎలా ఉన్నా ఆస్ట్రేలియా బరిలో ఉంటే మిగతా జట్లు ఇక రెండో స్థానం కోసమే పోటీపడాలనేలా మహిళల టీ20 ప్రపంచకప్‌లో కంగారూ అమ్మాయిల ఆధిపత్యం కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ స్టార్‌ క్రికెటర్లతో, మైదానంలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆ జట్టు కప్పు వేటలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఏడు టీ20 ప్రపంచకప్‌లు జరిగితే అందులో అయిదు సార్లు ఆ జట్టే విజేత. ప్రతి టోర్నీలోనూ కనీసం సెమీస్‌ చేరింది. ఇప్పుడు శుక్రవారం దక్షిణాఫ్రికాలో ఆరంభమయ్యే పొట్టి కప్పులోనూ గెలిచి ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో ఉంది.

నంబర్‌వన్‌ టీ20 జట్టుగా బరిలో దిగుతున్న ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. అయిదో టీ20 ప్రపంచకప్‌ ఆడబోతున్న కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ మరోసారి జట్టుకు కప్పు అందించాలని చూస్తోంది. 2020 ప్రపంచకప్‌ తర్వాత ఆ జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. కానీ ఇప్పుడు కూడా యువ, అనుభవజ్ఞులైన క్రికెటర్ల కూర్పుతో బలంగానే కనిపిస్తోంది. నిరుడు కామన్వెల్త్‌ క్రీడల ఛాంపియన్‌గా నిలిచింది. గత 17 టీ20 మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో మాత్రమే ఓడింది.

ప్రపంచ్​ కప్​కు సిద్ధమైన ఆసిస్​ జట్టు

సవాలు విసిరేదెవరు?: మొత్తం 10 జట్లు పోటీపడనున్న ఈ ప్రపంచకప్‌లో ఆసీస్‌కు సవాలు విసిరే అవకాశాలున్న జట్లు అయిదున్నాయి. మాజీ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో పాటు రెండు సార్లు రన్నరప్‌ న్యూజిలాండ్‌, గత ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడిన భారత్‌, తొలిసారి ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా టైటిల్‌పై కన్నేశాయి. కానీ కప్పును చేరాలంటే ఆస్ట్రేలియా విఘ్నాన్ని దాటాల్సిందే. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో గ్రూప్‌-1లో ఉన్న ఆసీస్‌ అగ్రస్థానంతో సులువుగానే సెమీస్‌ చేరొచ్చు.

గ్రూప్‌ దశలో ఆ జట్టుతో మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాయన్నది ఆసక్తికరం. ఒకవేళ కంగారూ జట్టును కట్టడి చేయడంలో ఇవి విఫలమైతే.. అప్పుడు ఈ రెండు జట్లలో ఒకటి మాత్రమే సెమీస్‌లో అడుగుపెట్టే ఆస్కారముంది. ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్లో భారత్‌పై గెలిచిన సఫారీ జట్టు సొంతగడ్డపై ఈ ప్రపంచకప్‌లో సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు మూడు సార్లు రన్నరప్‌ కూడా అయిన ఇంగ్లాండ్‌.. రెండో కప్పు నిరీక్షణకు ముగింపు పలకాలనుకుంటోంది.

గ్రూప్‌-2లో ఆ జట్టుతో పాటు భారత్‌, పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, వెస్టిండీస్‌ ఉన్నాయి. ఈ గ్రూప్‌ నుంచి ఇంగ్లాండ్‌, భారత్‌ సెమీస్‌ చేరేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో సెమీస్‌లో లేదా ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఈ జట్లు తలపడే అవకాశముంది. కామన్వెల్త్‌ క్రీడల ఫైనల్లో ఆస్ట్రేలియాకు టీమ్‌ఇండియా గట్టిపోటీనిచ్చింది. అంతే కాకుండా కంగారూ గడ్డపై సూపర్‌ ఓవర్లో ఆ జట్టును ఓడించి, వరుస విజయాల రికార్డుకు బ్రేక్‌ వేసింది భారతే. 2020 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన భారత్‌.. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. 5 ఆస్ట్రేలియా నెగ్గిన మహిళల టీ20 ప్రపంచకప్‌లు. 2010, 2012, 2014, 2018, 2020లో ఆ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. 2009లో ఇంగ్లాండ్‌, 2016లో వెస్టిండీస్‌ కప్పు గెలిచాయి.

ABOUT THE AUTHOR

...view details