సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా చివరి వరకు పోరాడి ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ని ఆసీస్ 3-1 తేడాతో ఒక మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (46; 30 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్), దేవిక వైద్య (32) రాణించారు. చివర్లో రిచా ఘోష్ (40; 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా జట్టుని గెలిపించలేకపోయింది. జెమిమా రోడ్రిగ్స్ (10), స్మృతి మంధాన (16), షెఫాలీ వర్మ (20) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలానా కింగ్, ఆష్లీ గార్డనర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డార్సీ బ్రౌన్ ఒక వికెట్ తీసింది.
నాలుగో టీ20లో మహిళల జట్టు ఓటమి.. సిరీస్ ఆశలు గల్లంతు
సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా చివరి వరకు పోరాడి ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో ఒక మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ (72; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకంతో అదరగొట్టింది. కెప్టెన్ అలిస్సా హీలీ (30; 21 బంతుల్లో 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా.. ఆష్లీ గార్డనర్ (42; 27 బంతుల్ల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించింది. చివర్లో గ్రేస్ హారిస్ (27; 12 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. ఇక, నామమాత్రపు ఐదో టీ20 మంగళవారం (డిసెంబరు 20)న జరగనుంది.