వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ టీమ్ఇండియా విజయపరంపర కొనసాగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 26 ఓవర్లలోనే 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. కెప్టెన్ నికోలస్ పూరన్ (42; 32 బంతుల్లో 5x4, 1x6), బ్రెండన్ కింగ్ (42; 37 బంతుల్లో 5x4, 1x6) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ మొత్తం చేతులెత్తేశారు. వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. తొలుత యువ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ (98; 98 బంతుల్లో 7x4, 2x6) రాణించగా.. తర్వాత బౌలర్లు చాహల్ 4/17, సిరాజ్ 2/14, శార్దూల్ 2/17 తమ పని పూర్తిచేశారు. దీంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్.. కరీబియన్ జట్టుపై వరుసగా 12 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచి.. ఈ రికార్డు నెలకొల్పిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది.
సిరాజ్ అదిరే ఆరంభం..:భారీ ఛేదనకు దిగిన విండీస్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ వేసిన రెండో ఓవర్లోనే రెండు వికెట్లు తీసి భారత్‌కు అదిరే ఆరంభం ఇచ్చాడు. తన తొలి ఓవర్లోనే మేయర్స్(0), బ్రూక్స్ (0)లను డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. తర్వాత షై హోప్ (22; 33 బంతుల్లో 1x6), బ్రెండన్ కింగ్ నిలకడగా ఆడి కాసేపు వికెట్లను కాపాడుకున్నారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చాహల్ విడదీశాడు. అతడు వేసిన 9.5 ఓవర్‌కు హోప్ స్టంపౌటయ్యాడు. తర్వాత కెప్టెన్ పూరన్ క్రీజులోకి రాగా.. కింగ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించేలా కనిపించాడు. కానీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కింగ్ బౌల్డవ్వడంతో కరీబియన్ జట్టు 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కార్టీ (5)తో కలిసి కాస్త నిలకడగా ఆడిన పూరన్ సైతం.. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 103 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. తర్వాత టెయిలెండర్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో విండీస్ ఓటమి ఖాయమైంది.