ICC T20 World Cup 2022 : మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. మైదానాలు పచ్చదనం పూసుకుంటున్నాయి. పిచ్‌లు పదునెక్కుతున్నాయ్. స్టాండ్లు ప్రేక్షకుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో చిలకాల ప్రత్యర్థులు ఎదురు పడితే.. అది దాయాదుల కురుక్షేత్రమే. మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23న అలాంటి యుద్ధమే జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ట్విట్టర్ హ్యాండిల్ ఓ పోస్ట్ చేసింది. అందులో గ్రౌండ్లో వరల్డ్ కప్ కోసం గ్రౌండ్లో పని జరుగుతున్న ఫొటోలు షేర్ చేసింది. దానికి " క్రికెట్ లోడింగ్" అని క్యాప్షన్ జత చేసింది.
ఈ సంవత్సరం ఇదివరకే ఈ దేశాల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లు చూసే అదృష్టం ప్రేక్షకులకు కలిగింది. పురుషుల మ్యాచ్‌లు రెండు జరగ్గా.. మహిళలు ఒక మ్యాచ్ ఆడారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా మహిళల జట్టు జులై 31న పాకిస్థాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 18 ఓవర్లు అడిన పాకిస్థాన్.. 99 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. 100 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 11.4 ఓవర్లలో సునాయాసంగా.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే కామన్వెల్త్లో సిల్వర్ మెడల్ సాధించింది.
ఇక ఆసియా కప్ 2022లో ఆగస్టు 28న పురుషుల జట్టు పాకిస్థాన్‌తో ఆడింది. అందులో 19.5 ఓవర్లలో 147 పరుగులకే పాక్‌ను కట్టడి చేసింది. 148 పరుగుల టార్గెట్‌ను ఛేదించి గెలిచింది టీమ్ ఇండియా. మళ్లీ సెప్టెంబర్ 4న తలపడిన టీమ్ ఇండియా సూపర్ 4 ఫేజ్‌లో ఓటమిపాలైంది. దీంతో ఆసియా కప్ రేస్ నుంచి వెనుదిరిగింది. అలాగే 2021లో కూడా పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. అప్పుడు సూపర్ 12 ఫేజ్‌లో టోర్నమెంట్ నుంచి బయటకు వచ్చింది.
అయితే ఈ ఓటములన్నిటిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది టీమ్ ఇండియా. ఇటీవల ఆసియా కప్ పరాభవాన్ని టీమ్ ఇండియా ఇంకా మరచిపోలేదు. అయితే అస్ట్రేలియాతో జరిగిన సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత వైఫల్యాలు బయటపడ్డాయి. ఇలా అయితే వరల్డ్ కప్ నెగ్గడం కష్టమే అని విమర్శలు వచ్చాయి. కానీ మళ్లీ తేరుకున్న టీమ్ ఇండియా సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకుంది. అయినా సమస్యలు టీమ్ ఇండియాను వెంటాడుతున్నాయి.