India W Tour Of Bangladesh 2023 : ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలో.. టీమ్ఇండియా ఓటమి పాలైంది. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు.. 40 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత్ పతనాన్ని శాసించిన బంగ్లాదేశ్ బౌలర్ మరుఫా అక్తర్ (4 వికెట్లు) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
153 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ స్మృతి మందానా మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. తర్వాత భారత్ క్రమంగా వికెట్లు పారేసుకుంది. స్వల్ప వ్యవధిలోనే మరో ఓపెనర్ ప్రియా పునియా, కెప్టెన్ హర్మన్, యస్తికా భాటియా, జెమిమా నలుగురు ఔట్ అవ్వడం వల్ల టీమ్ఇండియా మరింత ఒత్తిడిలో పడింది. దీంతో భారత్ 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఆశలన్నీ ఆల్రౌండర్ దీప్తీ శర్మపైనే పెట్టుకున్న టీమ్ఇండియా.. 91 పరుగుల వద్ద ఆమె కూడా పెవిలియన్ చేరడం వల్ల బంగ్లాదేశ్ విజయం లాంఛనమైంది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడం వల్ల 35.5 ఓవర్లలో 113 పరుగులకు టీమ్ఇండియా ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మరూఫా అక్తర్ 4, రబియా ఖాన్ 3, నహిదా అక్తర్, సుల్తానా తలో వికెట్ తీశారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ బుధవారం జరగనుంది.