Ind w vs Ban W Third ODI :ఐసీసీ ఛాంపియన్షిప్లో భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 225 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇరు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. కాగా భారత బ్యాటర్ హర్లీన్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కగా.. ఈ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన బంగ్లాదేశ్ ప్లేయర్ ఫర్గానా హోక్ (107)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.
226 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఐదు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక మిడిలార్డర్లో వచ్చిన హర్లీన్ (77).. ఓపెనర్ స్మృతి మంధాన(59) ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ క్రమంలోనే అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. కానీ స్మృతి.. ఫహిమా బౌలింగ్లో ఔట్ అయ్యింది. తర్వాత కెప్టెన్ హర్మన్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అప్పటి నుంచి ఓ వైపు హర్లీన్ పోరాడుతున్నా.. మరో ఎండ్లో ఆమెకు సహకారం లేదు. ఇక ఆమె ఇన్నింగ్స్ 42 ఓవర్లో రనౌట్ అయ్యి పెవిలియన్ చేరడం వల్ల భారత్ కష్టాలు పెరిగాయి.