Mohammed kaif comment on KL Rahul:గాయం నుంచి కోలుకుని చాన్నాళ్ల తర్వాత కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వచ్చాడు. అయితే తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు. కానీ రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ (1) ఘోరంగా విఫలమయ్యాడు. సోమవారం జింబాబ్వేతో మూడో వన్డేలోనైనా ఫామ్‌లోకి రావాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకో వారం రోజుల్లో కీలకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ ఫామ్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. కానీ రాహుల్ ఫామ్‌పై ఎలాంటి కంగారు అవసరంలేదని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు.
"కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చాడు. అతడు క్లాస్ ప్లేయర్. అందుకే అతడి ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని చెప్తా. నిన్న జింబాబ్వేతో మ్యాచ్‌లో అద్భుతమైన డెలివరీకి ఔట్ అయ్యాడు. కొత్త బంతిని ఆడటం చాలా కష్టం. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడానూ బ్యాటింగ్ ప్యాడ్‌లను పట్టుకుని కేఎల్ రాహుల్ ఉన్నాడు. నెట్ ప్రాక్టీస్ కోసం సిద్ధమయ్యాడు. తన రిథమ్‌ను తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నించడం అభినందనీయం. భారత టీ20 లీగ్ ఆఖర్లో రాహుల్ గాయపడ్డాడు. ఆ సమయంలో అతడు మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. రెండు సెంచరీలు సహా భారీగానే పరుగులు సాధించాడు. కానీ గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన రాహుల్‌కు మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు" అని కైఫ్ వివరించాడు.
బౌలర్లకు స్వేచ్ఛ ఇస్తాడు: సిరాజ్
జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా జట్టులోని వాతావరణం అద్భుతంగా ఉందని పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ బౌలర్లకు ఎంతో స్వేచ్ఛనిస్తాడని పేర్కొన్నాడు. "గత విండీస్, ఇంగ్లాండ్ సిరీసుల్లో నా బౌలింగ్ రిథమ్ బాగుంది. ఇప్పుడు కూడా సరైన ప్రాంతంలో బంతులను సంధించగలిగా. వికెట్ల గురించి ఆలోచించకుండా లెంగ్త్‌తో బౌలింగ్ చేయడమే నా లక్ష్యం. ప్రస్తుతం కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమ్‌ఇండియాలో వాతావరణం అద్భుతంగా ఉంది. రాహుల్ బౌలర్లకు కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తాడు" అని సిరాజ్ తెలిపాడు. సోమవారం జింబాబ్వేతో మూడో వన్డే జరగనుంది.