India Vs Westindies 3rd T20 : వెస్టిండీస్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ మూడో మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధించింది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన భారత్ సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లతో రాణించాడు. తర్వాత 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టును ఓపెనర్లు నిరాశ పర్చారు. యశస్వీ జైస్వాల్ ఒకటి, శుభ్‌మన్ గిల్ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించారు.
సూర్యకుమార్ 83 పరుగులతో సత్తాచాటాడు. సూర్యకుమార్ ఔట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సారథి హార్దిక్ పాండ్యామరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.తిలక్ వర్మతో కలిసి 17.5 ఓవర్లలో జట్టును విజయాన్ని అందించాడు. తిలక్ 49 పరుగులతోనూ, పాండ్యా 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
కళ్లు చెదిరే షాట్లతో సూర్య మెరుపులు..
Surya Kumar Yadav Ind VS WI : ప్రావిడెన్స్ వేదికగా జరిగిన మూడో టీ20లో మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో విజృంభించాడు. 360 డిగ్రీ ఫామ్‌ను కొనసాగించిన స్కై.. కళ్లు చెదిరే షాట్లతో అభిమానులను అలరించాడు. ఫోర్లు, సిక్స్‌లను వరుసగా బాదుతూ జట్టును విజయం పథంలోకి నడిపించాడు.
అయితే ఛేదనలో భారత ఓపెనర్లిద్దరూ విఫలమయ్యారు. ఇషాన్ కిషన్ స్థానంలో వచ్చిన యశస్వి జైస్వాల్ (1) తొలి ఓవర్లోనే క్యాచ్ ఔట్ కాగా.. అయిదో ఓవర్లో గిల్ (6) పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి మన స్కోరు 34. కానీ తొలి బంతి నుంచే సూర్య జోరు మొదలైంది. జైస్వాల్ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కై తొలి రెండు బంతుల్లో వరుసగా 4, 6 కొట్టి ఒక్కసారిగా అందరిలోనూ ఆశలు నింపాడు. తిలక్ వర్మది కూడా కీలక ఇన్నింగ్సే. తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ తిలక్ మరోసారి సత్తా చాటాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను చక్కని షాట్లతో బౌండరీ దాటించాడు.