Virat Kohli Runs Record : వెస్టిండీస్‌లోని డొమినికా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ సిరీస్‌తో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. మైదానంలో మంచి జోరు మీదున్న ఈ రన్నింగ్ మెషిన్.. విండీస్ వేదికగా లెజండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా నిలిచాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో అతను 8,515 పరుగులను స్కోర్ చేసి ఈ లిస్ట్‌లోకి చేరుకున్నాడు.
ఈ జాబితాలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. అతడు తన టెస్టు కెరీర్‌లో 15,921 పరుగులు చేశాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ 13,265 పరుగులతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన తొలి ఆటగాడు సునీల్ గవాస్కర్.. 10,122 పరుగుల మార్క్‌తో మూడో స్థానంలో ఉండగా.. వీవీఎస్ లక్ష్మణ్ 8,781 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
Yashasvi Jaiswal Record : మరోవైపు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా తన అరంగేట్ర మ్యాచ్‌లో శతకాన్ని బాదాడు. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నిలకడైన ఆటతీరును ప్రదర్శిన జైస్వాల్.. అలుపెరగని యోధుడిలా ఆడి శతకాన్ని పూర్తి చేశాడు. దీంకతో అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 17వ భారత బ్యాటర్‌గా ఓ అదుదైన రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రెండో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్రకెక్కాడు. అయితే 2013 మార్చిలో శిఖర్ ధావన్ (187) ఆసీస్‌పై శతకం బాదాడు.
ఆ తర్వాత ఇప్పుడు జైస్వాల్ సెంచరీ చేయడం విశేషం. ఇక ఓపెనర్‌గా తొలి టెస్టులోనే శతకాన్ని బాదిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అంతకుముందు ఈ లిస్ట్‌లో శిఖర్ ధావన్, పృథ్వీ షా ఉండగా.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విండీస్‌పైనే అరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు. 2013 నవంబర్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 177 పరుగులు చేశాడు. అయితే ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా శిఖర్ ధావన్ ఉన్నాడు. అతడు తన తొలి ఇన్నింగ్స్‌లోనే 187 పరుగులు సాధించాడు. అయితే టీమ్‌ఇండియా తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లో అతి పిన్న వయసులో (21 ఏళ్ల 196 రోజులు) సెంచరీ బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ మరో రికార్డు సృష్టించాడు. ఈ లిస్ట్‌లో పృథ్వీ షా (18 ఏళ్ల 329 రోజులు), అబ్బాస్ అలీ (20 ఏళ్ల 126 రోజులు), గుండప్ప విశ్వనాథ్ (20 ఏళ్ల 276 రోజులు)కూడా ఉండటం విశేషం.