India vs West indies: గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్ల సారథి రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లకు రోహిత్ అందుబాటులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. తెల్ల బంతి ఫార్మాట్‌కు పూర్తిస్థాయి నాయకుడిగా ఎంపికైన తర్వాత తొలిసారి జట్టు పగ్గాలను చేపట్టే అవకాశం ఉంది.
"రోహిత్ ఫిట్‌గా ఉన్నాడు. విండీస్‌తో సిరీస్‌కు సిద్ధం. దాదాపు ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకుని గాయం నుంచి కోలుకున్నాడు. ముంబయిలో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరవుతాడు. అందులో తప్పకుండా పాస్‌అవుతాడు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో వెల్లడించారు.
ఈ వారంలోనే వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. ఇదే సమయంలో టెస్టు సారథ్యంపైనా నిర్ణయం తీసుకోవచ్చనే వాదనా వినిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌కూ రోహిత్‌నే ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. వరుసగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో పనిభారం కాకుండా టెస్టు సారథిగా వేరొకరి పేరును కూడా బీసీసీఐ పరిశీలిస్తోందని సమాచారం. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ విజయవంతం అయినట్లు కనిపించలేదు. అదేవిధంగా ఐపీఎల్‌లోని లఖ్‌నవూ సూపర్ జెయింట్ సారథిగా కేఎల్ రాహుల్ పనితీరుపైనా దృష్టిసారించే అవకాశం ఉంది.