IND VS WI ODI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల ఈ సిరీస్‌లో శుభారంభం చేసి బోణీ కొట్టింది. 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి విండీస్ ఆఖరి బంతి వరకూ పోరాడింది. ఈ క్రమంలోనే చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా 11 పరుగులు చేసి చివరికి 305/6తో సరిపెట్టుకుంది. అయితే, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రోమారియో షెపర్డ్ (39 నాటౌట్) చివర్లో ధాటిగా ఆడి భారత్‌ను కంగారు పెట్టించాడు. హోసీన్ (33 నాటౌట్)తో కలిసి అతడు విండీస్‌ను గెలిపించినంత పనిచేశాడు. అయితే, సిరాజ్ ఆఖరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బంతులేసి ఉత్కంఠకర పరిస్థితుల్లో భారత్‌ను గెలిపించాడు.
ఆదిలోనే వికెట్ దక్కినా..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను సిరాజ్ ఆదిలోనే దెబ్బతీశాడు. ఐదో ఓవర్‌లో షై హోప్ (7)ను ఔట్ చేసి శుభారంభం అందించాడు. దీంతో విండీస్ 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, కైల్ మేయర్స్ (75), బ్రూక్స్ (46) రెండో వికెట్‌కు 117 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించి విండీస్‌ను పోటీలో నిలబెట్టారు. ఈ క్రమంలోనే మేయర్స్ ధాటిగా ఆడగా బ్రూక్స్ నెమ్మదిగా ఆడాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ శతక భాగస్వామ్యం నిర్మించారు. దీంతో ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దనీ శార్దూల్ ఠాకూర్ స్వల్ప వ్యవధిలో ఔట్ చేశాడు. తొలుత బ్రూక్స్ శ్రేయస్ చేతికి చిక్కగా తర్వాత మేయర్స్ వికెట్ కీపర్‌కు చిక్కాడు. దీంతో విండీస్ 138 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. అనంతరం బ్రాండన్ కింగ్ (54), కెప్టెన్ నికోలస్ పూరన్ (25) నిలకడగా ఆడి వికెట్లను కాపాడుకున్నారు.