India VS West Indies 5th T20 Result : వెస్టిండీస్‌తో తొలి రెండు టీ20ల్లో ఓడిపోయి సిరీస్ రేసులో వెనుకబడిన టీమ్ఇండియా.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సమం చేసింది. ఈ తర్వాత కీలకమైన ఐదో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఫ్లోరిడా పిచ్‌పై భారీ స్కోర్ చేయలేకపోయింది. ఎప్పటిలాగే టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్, బౌలింగ్‌లో అంతగా ప్రభావం చూపించలేదు. బ్యాటింగ్‌లో 18 బంతుల్లో ఎదుర్కొన్న పాండ్య కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఓవర్లు బౌలింగ్ వేసి 32 పరుగులు ఇచ్చాడు. తొలిసారి హార్దిక్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా సిరీస్ ఓడిపోయింది. ఈ క్రమంలో మ్యాచ్‌లో జట్టు వైఫల్యంపై హార్దిక్ పాండ్య స్పందించాడు.
Hardik Pandya On Fifth T20 Match : తాను బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఉన్న జోరును కొనసాగించడంలో విఫలమయ్యామని హార్దిక్ తెలిపాడు. ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని భారీగా పరుగులు సాధించలేకపోయామని చెప్పాడు. సవాళ్లు ఎదురవుతాయని తెలుసని.. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నించామని అన్నాడు. 'విండీస్‌తో మ్యాచ్ ఓటమి గురించి మరీ ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టీమ్ఇండియా ఆటగాళ్లు ఎలా ఆడారనేది నాకు తెలుసు. ఒక్కోసారి ఓటమి నుంచి చాలా విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. యువకులు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. వాళ్లే ముందుకొచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం సంతోషాన్ని ఇచ్చింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులకులందరికీ ధన్యవాదాలు.' అని పాండ్య తెలిపాడు.
మరోవైపు భారత్‌పై సిరీస్ గెలవడంపై విండీస్ కెప్టెన్ పావెల్ స్పందించాడు. సిరీస్‌ను గెలవడంపై మాట్లాడేందుకు మాటలు దొరకడం లేదని అన్నాడు. విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ప్రదర్శన అద్భుతమని పావెల్ తెలిపాడు. 'మ్యాచ్‌కు ముందు మేమంతా కూర్చుని మాట్లాడుకున్నాం. సిరీస్ నెగ్గడం వెనుక కోచింగ్ సిబ్బంది పాత్ర కూడా చాలా ఉంది. నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడు. అతడు విండీస్ జట్టుకు కీలక ప్లేయర్. ఒక్కరు మెరుగ్గా ఆడినా జట్టుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. 5 మ్యాచుల్లో కనీసం మూడింట్లోనైనా ఆడమని పూరన్‌ను కోరాం. ప్రతి మ్యాచ్‌లోనూ అతడు ప్రభావం చూపించాడు. కీలకమైన ఐదో టీ20లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. విండీస్‌కు అండగా నిలిచిన ప్రేక్షకులు, సామాజిక మాధ్యమాల్లో వేదికకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని విండీస్ కెప్టెన్ పావెల్ అన్నాడు.