India vs West Indies 4th T20 :విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టెస్టుల్లో తమ సత్తా చాటిన టీమ్ఇండియా.. టీ20ల్లోకి వచ్చేసరికి విండీస్ ముందు విలవిలలాడుతోంది. అప్పటివరకు ఫామ్‌లో ఉంటూ వచ్చిన ఇండియన్ టీమ్.. టీ20 తొలి రెండు మ్యాచ్‌ల్లో కరేబియన్ జట్టు ఇచ్చిన షాకులతో ఒక్కసారిగా డీలా పడింది. అయితే మరో ఓటమి ఎదురైతే ఇక సిరీస్ చేజారే స్థితిలోకి చేరుకున్న హార్దిక్ సేన.. మూడో టీ20లో నెగ్గి తన వేగాన్ని పుంజుకుంది. కానీ కథ అంతటితో ఆగిపోలేదు. రానున్న నాలుగో టీ20లోనూ అదే పరిస్థితి.. ఈ మ్యాచ్ ఓడినా సరే సిరీస్ పోతుంది. అందుకే తమకున్న పట్టుదలను, తీవ్రతను కొనసాగిస్తూ మరో విజయాన్ని కైవసం చేసుకునేందుకు హార్దిక్ సేన తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా వేదికగా జరగనున్న చివరి రెండు టీ20ల్లో భారత జట్టు ఏ మేర ప్రదర్శన చూపిస్తుందో వేచి చూడాలి.
గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలైన తర్వాత పొట్టి క్రికెట్ కోసం.. సారధ్య బాధ్యతలు అందుకున్నాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. ఇక ఇప్పటి వరకు ఆడిన నాలుగు సిరీస్‌ల్లోనూ భారత్‌దే విజయంగా నడుస్తూ వస్తోంది. విండీస్ పర్యటనలో భాగంగా ఇప్పుడు మనం ఐదో సిరీస్‌ను ఆడుతున్నాం. ఈ క్రమంలో తొలిసారి సిరీస్ కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న హార్దిక్.. దీన్ని ఎలా అధిగమిస్తాడు అన్నది ఆసక్తికర విషయం.
మరోవైపు ప్రమాదకర టీ20 ఆటగాళ్లతో నిండిన విండీస్‌ను మూడో మ్యాచ్‌లో తేలిగ్గానే ఓడించిన భారత్.. అదే ఊపులో మరో విజయాన్ని తమ ఖాతాలోకి వేసుకోవాలని చూస్తోంది. అయితే బ్యాటింగ్‌కు బాగా సహకరించే లాడర్‌హిల్ పిచ్‌పై విండీస్ ప్లేయర్లను ఆపి సిరీస్ సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు.
Tilak Varma In IND VS WI T20 : ఇక ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నది హైదరాబాదీ యువ ఆటగాడు తిలక్ వర్మఅన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొడుతూ వచ్చిన తిలక్.. మూడు మ్యాచ్‌ల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి తన సత్తా చాటాడు. 20 ఏళ్ల వయసులోనే అతను చూపిస్తున్న ప్రదర్శన ఇప్పుడు సర్వత్ర ప్రశంసలు అందుకుంటోంది. అతను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే..వన్డే ప్రపంచకప్‌కు బలమైన పోటీదారుగా మారుతాడు అన్న విషయం ఖాయం. అంతే కాకుండా బ్యాటింగ్ పిచ్‌పై అతను మరింత చెలరేగుతాడేమో వేచి చూడాలి.
ఇక ఒకప్పటి తన ఆట తీరును గుర్తు చేస్తూ గత మ్యాచ్‌లో చెలరేగిపోయినసూర్యకుమార్ యాదవ్ నుంచి హార్దిక్ సేన మరో మెరుపు ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. అయితే ఓపెనర్ శుభ్‌మన్ ఫామ్ అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌లోనే టీ20 అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ కూడా రానున్న మ్యాచ్‌లో తనదైన ముద్రను వేయాల్సి ఉంది. ఇక తనకిచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ ఏ మేర ఉపయోగించుకుంటాడో కూడా రానున్న మ్యాచ్‌లో చూడాల్సిందే.
మరోవైపు బౌలింగ్‌లో కుల్‌దీప్, చాహల్, అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌కు కీలకం కానున్నారు. పరుగుల పిచ్ మీద విండీస్ బ్యాటర్లను ఆపడం అనేది భారత బౌలర్లకు అంత తేలిక కాదు. ముఖ్యంగా రోమన్ పావెల్, పూరన్, హెట్‌మయర్‌లకు అవకాశమిస్తే ఇక అంతే.. తమ ప్రదర్శనతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంటారు.