India Vs West indies 2023 : జూలై 12న అట్టహాసంగా మొదలైన విండీస్ పర్యటన ముగిసింది. టెస్టుల్లో దూసుకెళ్లిన టీమ్ఇండియా పొట్టి ఫార్మాట్‌లో మాత్రం బోర్లా పడి.. సిరీస్‌ను విండీస్‌కు అప్పగించేసింది. కరేబియన్ జట్టును తక్కువ అంచనా వేసిన వేసిన హార్దిక్ సేన.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-3 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. యువ బ్యాటర్లు తప్ప.. సీనియర్లు పెద్దగా రాణించకపోవడం వల్ల టీమ్ఇండియాకు నిరాశే ఎదురైంది. అయితే వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న సమయంలో మదిలో అనేక ప్రశ్నలతో విండీస్‌కు పయనమైన టీమ్‌ఇండియా.. ఈ నెల రోజుల వ్యవథిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కోగా.. ఇంకొన్ని మాత్రం అలాగే ఉండిపోయాయి. మరోవైపు కొత్తగా కొన్ని ప్రశ్నలూ రేకెత్తాయి. అవేంటంటే..
ముగ్గురు మొనగాళ్ల కథ..
India Tour Of Westindies : విండీస్‌తో ఆడనున్న భారత జట్టు కోసం ముగ్గురు యువ ఆటగాళ్లు తొలిసారి కరేబియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ఆటగాళ్లు మ్యాచుల్లో తమ సత్తా చాటగలరా లేదా అన్న ప్రశ్నకు మాత్రం సానుకూల సమాధానమే దొరికింది. ఎంతో ఆశలతో క్రీజులోకి దిగిన ఆ ముగ్గురు.. తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించారు.
Yashasvi Jaiswal Westindies Records :అయితే అందరిలోకి ఎక్కువ ఆకట్టుకున్నది యశస్వి జైస్వాల్. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ యంగ్ ప్లేయర్.. వెస్టిండీస్ పర్యటనతోనే టెస్టులతో పాటు టీ20ల్లోనూ అరంగేట్రం చేశాడు. తొలి సారి అయినప్పటికీ.. టెస్టుల్లో తొలి మ్యాచ్‌ల్లోనే 171 పరుగులు చేసి అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు. ఇక రెండో టెస్టులో అయితే ఓ అర్ధశతకాన్ని తన ఖాతాలోకి వేసుకుని చెలరేగిపోయాడు.మొత్తంగా ఈ సిరీస్‌లో 88.66 సగటుతో 266 పరుగులు చేశాడు యశస్వి. అంతే కాకుండా టీ20సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన జైస్వాల్.. 90 పరుగులు సాధించి సెంచరీకి చేరువయ్యాడు. అలాగే నాలుగో టీ20లో 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు.
Tilak Varma India Vs West Indies : అరంగేట్రంలోనే అదరగొట్టిన మరో యువ ఆటగాడు తిలక్ వర్మ. 20 ఏళ్ల ఈ హైదరాబాదీ కుర్రాడు.. ఆడిన 5 టీ20ల్లో 57.66 సగటుతో 173 పరుగులు సాధించి రికార్డుకెక్కాడు. మిడిలార్డర్లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్.. తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి టీమ్‌ఇండియా భవిష్యత్ స్టార్‌గా కితాబులందుకున్నాడు. బ్యాటింగ్‌తోనే కాదు చివరి టీ20లో అతను బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. తిలక్ అత్యద్భుత ప్రదర్శనను వీక్షించిన అభిమానులు వన్డే జట్టులోకి కూడా అతణ్ని ఎంపిక చేసి ప్రపంచకప్‌లో ఆడించాలన్న డిమాండ్లు చేస్తున్నారు.
Mukesh Kumar Wickets :ఇక బెంగాలీ యంగ్ పేసర్ ముకేశ్ కుమార్.. విండీస్ పర్యటనతోనే ఒకేసారి టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఎక్కువ వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ.. చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను వేయడంతో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో బుమ్రా లేక బలహీన పడ్డ బౌలింగ్ విభాగానికి తన స్కిల్‌తో కొంత బలాన్ని చేకూర్చాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి అతను 9 వికెట్లు తీశాడు.
Ishan Kishan West Indies Tour : మరోవైపు ఇషాన్ కిషన్ కూడా వన్డేల్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన ఈ సిరీస్‌లో అతను 3 మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు బాది ఔరా అనిపించాడు. 61.33 సగటుతో 184 పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు నెలకొన్న తరుణంలో ఈ ప్రదర్శనతో ఇషాన్ జట్టుకు భరోసానిచ్చాడు.