India Vs Srilanka World Cup 2023 :వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్- శ్రీలంక జట్ల మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు టీమ్ఇండియాను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్ ప్లేయర్లు చెలరేగిపోయారు. విరాట్ కోహ్లి (88), శుభ్‌మన్ గిల్(92), శ్రేయస్ అయ్యర్(82), రవీంద్ర జడేజా(34).. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించి శ్రీలంకకు 357 పరుగుల టార్గెట్‌ను ఫిక్స్ చేశారు.
ఓపెనర్ రోహిత్ శర్మ(4) ఈ సారి తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టగా.. కేఎల్ రాహుల్ (21), సూర్యకుమార్ యాదవ్ (12), షమీ (4) కూడా తమ వంతు కృషి చేశారు. అయినప్పటికీ ఎక్కువ సమయం క్రీజులో నిలవలేకపోయారు. ఇక లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక ఏకంగా ఐదు వికెట్లు తీసి రికార్డుకెక్కాడు. మరో బౌలర్ దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టాడు.
జస్ట్ మిస్.. ఆ రికార్డును చేజార్చుకున్న కోహ్లి..
Virat Kohli World Cup 2023 :ఇదే వేదికపై విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవాల్సింది. కానీ త్రుటిలో ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. మూడో బ్యాటర్‌గా రంగంలోకి దిగిన కోహ్లి.. 94 బంతుల్లో 88 పరుగులు చేశాడు. అయితే సెంచరీ మార్క్ అందుకుంటాడని అనుకుంటున్న సమయంలో దిల్షాన్ మధుశంక వేసిన ఓవర్లో పాథుమ్ సిస్సంక చేతిలో ఔటై పెవిలియన్ బాట పట్టాడు. దీంతో వన్డేల్లో సచిన్ తెందూల్కర్ సాధించిన 49 శతకాల రికార్డును సమం చేసే అవకాశం విరాట్‌కు కాస్తలో చేజారింది. అయినప్పటికీ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (92)తో కలిసి రెండో వికెట్‌కు విరాట్ 189 పరుగులు జోడించాడు. వీరిద్దరూ కూడా శతకాలకు చేరువగా వచ్చి స్వల్ప వ్యవధుల్లో ఔట్ కావడం గమనార్హం.