శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజృంభించింది. భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. విరాట్ గర్జిస్తూ వీర విహారం చేశాడు. 110 బంతుల్లో 166 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 116 పరుగులతో శతకొట్టాడు. కాగా, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో పలు రికార్డులు బ్రేక్ చేశాడు . మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్నే అధిగమించి నయా చరిత్ర లిఖించాడు ఈ 'రన్ మెషీన్'.
అత్యధిక పరుగుల వీరుడు..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక బ్యాటర్ మహెల జయవర్ధనేను అధిగమించి ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 268 వన్డేల్లో 57.78 సగటుతో 12,652 పరుగులు చేశాడు. అందులో 183 అత్యధిక స్కోర్‌తో 45 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆరో స్థానానికి పడిపోయిన జయవర్ధనే.. 448 మ్యాచ్‌లు ఆడి 418 ఇన్నింగ్స్‌లో 33.37 సగటుతో 12,650 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 77 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 144 పరుగులు చేశాడు.