తెలంగాణ

telangana

చెలరేగిన భారత బౌలర్లు.. లంక స్కోరు 86/6

By

Published : Mar 12, 2022, 9:20 PM IST

Updated : Mar 12, 2022, 9:49 PM IST

INDIA VS SRILANKA: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే నైట్​ టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది లంక.

india vs srilanka test
india srilanka second test

INDIA VS SRILANKA: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆ సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 86/6తో నిలిచింది. నిరోషన్‌ డిక్వెల్లా (13*), ఎంబుల్దేనియా (0*) నాటౌట్‌గా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లంక ఇంకా 166 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు, మహ్మద్‌ షమి రెండు, అక్షర్‌ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ (92; 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రిషభ్ పంత్ (39; 26 బంతుల్లో 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా మూడు, జయవిక్రమ మూడు, ధనంజయ రెండు, లక్మల్‌ ఒక వికెట్ పడగొట్టారు.

షమీ

భారత ఆటగాళ్లను తక్కువ పరుగులకే కట్టడి చేసిన లంకేయులు.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. బుమ్రా వేసిన మూడో ఓవర్‌లోనే లంకకు ఎదరుదెబ్బ తగిలింది. కుశాల్ మెండిస్‌ (2) శ్రేయస్ అయ్యర్‌కి చిక్కాడు. దీంతో శ్రీలంక మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన ఐదో ఓవర్‌లో తొలి బంతికి తిరుమానె (8) ఔటయ్యాడు. షమి వేసిన తర్వాతి ఓవర్‌లో కరుణరత్నే (4) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికి లంక స్కోరు 14/3. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌, ధనంజయ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. కుదురుకుంటున్న ఈ జోడీని షమి వీడదీశాడు. ధనంజయ డిసిల్వ (10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన చరిత్ అసలంక (5) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతడిని అక్షర్‌ పటేల్‌ వెనక్కిపంపాడు. దీంతో లంక 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన డిక్వెల్లాతో కలిసి ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టాలనుకున్న మాథ్యూస్‌..బుమ్రా బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు చిక్కాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కడే..

శ్రేయస్

అంతకు ముందు, ఈ మ్యాచులో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ (92: 98 బంతుల్లో 10×4, 4×6) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. లసిత్ ఎంబుల్దెనియా వేసిన 35 ఓవర్లో మూడు ఫోర్లు బాదిన అయ్యర్‌.. ఆ తర్వాత ధనంజయ వేసిన 48వ ఓవర్లో రెండు సిక్సులు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ.. శతకం దిశగా సాగాడు. ఈ క్రమంలోనే ప్రవీణ్‌ జయవిక్రమ వేసిన 59.1 బంతిని భారీ షాట్‌గా మలిచే క్రమంలో ముందుకు వచ్చిన అయ్యర్‌ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (39: 26 బంతుల్లో 7×4), హనుమ విహారి (31: 81 బంతుల్లో 4×4) ఫర్వాలేదనిపించారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ (23) మరోసారి నిరాశ పరిచాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (15), ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (4), రవీంద్ర జడేజా (4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (13), అక్షర్‌ పటేల్ (9), మహమ్మద్‌ షమి (5) పరుగులు చేశారు.

ఇదీ చూడండి:అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్​పై భారీ విజయం

Last Updated : Mar 12, 2022, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details