తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో రోజూ మనదే.. తొలి ఇన్నింగ్స్​లో లంక 108/4 - india vs srilanka 1st test 2nd day

Mohali Test Day2: భారత్​- శ్రీలంక తొలి టెస్టు రెండోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో నిశాంక (26* ), అశలంక (1*​) ఉన్నారు. అంతకుముందు టీమ్​ఇండియా రవీంద్ర జడేజా శతకంతో.. 574 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్​ డిక్లేర్​ చేసింది.

India Vs Srilanka
భారత్ శ్రీలంక

By

Published : Mar 5, 2022, 5:22 PM IST

Updated : Mar 5, 2022, 7:03 PM IST

Mohali Test Day2: పంజాబ్ మొహాలీ వేదికగా జరుగుతున్న భారత్-​ శ్రీలంక తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్​లో 466 పరుగులు వెనుకబడి ఉంది. అశ్విన్ 2, జడేజా , బుమ్రా తలో వికెట్​ తీశారు.

అంతకుముందు.. రవీంద్ర జడేజా (175 నాటౌట్‌: 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించడం.. రవిచంద్రన్ అశ్విన్‌ (61: 8 ఫోర్లు) సమయోచిత బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది.

అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంకేయులను భారత బౌలర్లు దెబ్బకొట్టారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో నిశాంక (26 నాటౌట్​), అశలంక (1నాటౌట్​) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 2.. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. భారత్‌ తీసిన నాలుగు వికెట్లూ ఎల్బీడబ్ల్యూలే కావడం గమనార్హం.

లంక ఓపెనర్లు రాణించినా..

ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నె (28), లహిరు తిరిమన్నె (17) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్‌ కావడంతో నిశాంకతో కలిసి ఏంజెలో మాథ్యూస్ (22) ఆచి తూచి ఆడాడు. అయితే బుమ్రా సూపర్‌ బంతికి మాథ్యూస్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ నిర్ణయంపై సమీక్షకు వెళ్లిన మాథ్యూస్‌కు సమీక్షలోనూ చుక్కెదురైంది. దీంతో పెవిలియన్‌ బాట తప్పకపట్టలేదు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డిసిల్వా (1)ను అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు..

అంతకుముందు 357/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించడంలో రవీంద్ర జడేజా, అశ్విన్‌ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యం (130) నిర్మించారు. ఈ క్రమంలో జడేజా సెంచరీ, అశ్విన్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అశ్విన్‌ దూకుడుగా ఆడేందుకు యత్నించి అక్మల్‌ షార్ట్‌పిచ్‌ బంతికి కీపర్‌ చేతికి చిక్కాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జయంత్‌ యాదవ్‌ (2) వెంటనే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన షమీ (20*)తో కలిసి రవీంద్ర జడేజా దూకుడుగా ఆడేశాడు. వీరిద్దరూ కలిసి వంద పరుగుల (103) భాగస్వామ్యం నిర్మించారు.

ఈ క్రమంలో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏడో స్థానంలో దిగి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు కపిల్‌ దేవ్‌ (163) పేరిట ఈ రికార్డు ఉండేది. ఆఖరికి రెండో సెషన్‌ టీ బ్రేక్ సమయానికి కెప్టెన్‌ రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఇదీ చూడండి:బాలీవుడ్​లో షేన్​ వార్న్ బయోపిక్​.. స్పిన్ దిగ్గజం ఛాయిస్​ ఎవరంటే..?

Last Updated : Mar 5, 2022, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details