జోరుమీదున్న టీమ్‌ఇండియా గురువారం జరిగే రెండో వన్డేలో శ్రీలంకతో తలపడనుంది. బ్యాటర్లు చెలరేగడంతో తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తొలి ముగ్గురు బ్యాటర్లు మరోసారి సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. విరాట్ కోహ్లి ఫామ్ టీమ్‌ఇండియాకు పెద్ద సానుకూలాంశం. బ్యాటుతో అదరగొట్టిన కోహ్లి కెరీర్‌లో 73వ అంతర్జాతీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో అతడు పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేశాడు.
ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కెప్టెన్ రోహిత్ తన మ్యాచ్ ఫిట్‌నెస్‌పై సందేహాలను పటాపంచలు చేశాడు. ఇప్పుడు తన ఫేవరెట్ మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో చెలరేగేందుకు ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. ఎనిమిదేళ్ల కింద భారత్, లంక జట్లు చివరిసారి ఇక్కడ తలపడప్పుడు రోహిత్ ప్రపంచ రికార్డు స్కోరు (264) సాధించాడు. ఈసారి కూడా అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి.
చివరిసారి 2020 జనవరిలో వన్డే సెంచరీ (ఆస్ట్రేలియాపై) సాధించిన రోహిత్, ఈడెన్‌లోనైనా కరవు తీర్చుకుంటాడో లేదో చూడాలి. మరోవైపు యువ ఓపెనర్ శుభమ్‌న్ గిల్ చక్కని వన్డే ఫామ్‌ను కొనసాగిస్తుండడంతో భారత్ టాప్ ఆర్డర్ కుదురుకున్నట్లే కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో కేఎల్ రాహులే పుంజుకోవాల్సివుంది. బంతితోనూ భారత్ ధీమాగానే కనిపిస్తోంది. పేసర్ సిరాజ్.. షమి, ఉమ్రాన్ మాలిక్‌లతో కలిసి మరోసారి లంక బ్యాటర్లకు సమస్యలు సృష్టిస్తాడని జట్టు ఆశిస్తోంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా రెండో వన్డేలో బరిలోకి దిగే అవకాశముంది.