తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్​' పర్వంలో రెండో భాగం ఆరంభం.. విమర్శకులకు 'కింగ్​' కోహ్లి చెక్​! - స్వదేశంలో కోహ్లి వన్డే శతకాలు న్యూస్

ఆదివారం.. సంక్రాంతి పండగ.. దేశమంతా గాలిపటాలు ఎగురుతుంటే.. అక్కడ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో అతడి దెబ్బకు బంతి గాల్లోకి పదేపదే ఎగిరింది! ఉదయం మహిళలు ఇళ్ల ముందు చుక్కలు పెట్టి ముగ్గులేస్తే.. మధ్యాహ్నం మొదలు అతడు మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు! బంతిని నేలపై పరుగులు పెట్టించడం.. గాల్లో తేలేలా చేసి స్టాండ్స్‌లో పడేయడం..! షాట్‌ కుదిరిందా సిక్సర్‌ లేదంటే సర్దుబాటు చేసుకుని ఫోర్‌..! ఇలా పరుగుల వేటలో ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్‌ కోహ్లి క్రికెట్‌ అభిమానులకు అసలైన పండగ సంతోషాన్ని అందించాడు.

india vs sri lanka third one day match virat kohli
విరాట్ కొహ్లీ

By

Published : Jan 17, 2023, 7:36 AM IST

Virat Kohli : కోహ్లి పనైపోయిందా.. అదెలా? గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో అతను మూడో శతకం బాదేశాడు కదా! అతను జట్టుకు భారంగా మారుతున్నాడా.. అదెలా? జట్టు రికార్డు విజయంలో అతనే కీలక పాత్రధారి కదా! అవును.. కోహ్లి ఇప్పటికీ కింగే. మధ్యలో రెండేళ్ల పాటు అంతర్జాతీయ శతకం చేయకపోవచ్చు.. గడ్డు పరిస్థితులు ఎదుర్కొనవచ్చు.. నిరాశలో కుంగిపోవచ్చు.. కానీ అది పరిమిత కాలమే. ఆ చీకటిని దాటి అతను పుంజుకున్న వైనం అద్భుతం. సవాళ్లను దాటి సత్తాచాటుతున్న తీరు అసాధారణం. గతేడాది ఆసియా కప్‌లో శతకం మొదలు.. విరాట్‌ పర్వం రెండో భాగం ప్రారంభమైందనే చెప్పాలి. ఆ టోర్నీ కంటే ముందు 42 రోజుల పాటు విరామం తీసుకుని.. మనసును ప్రశాంతంగా మార్చుకుని, ఆత్మవిశ్వాసాన్ని అందుకుని మైదానంలో అడుగుపెట్టి సరికొత్త కోహ్లీని చూపిస్తున్నాడు. కళ్లు చెదిరే ఆటతో అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తూ శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల్లో 141.50 సగటుతో 283 పరుగులు చేసి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచాడు.

ఈ ఇన్నింగ్స్‌ ఓ పాఠం..
విరాట్‌ కొట్టని సెంచరీలా.. చేయని పరుగులా.. చూడని మైలురాళ్లా? కానీ లంకతో మూడో వన్డేలో అతని ఇన్నింగ్స్‌ ఆసాంతం ఓ బ్యాటింగ్‌ పాఠంలా సాగింది. ఎలాంటి తడబాటు, తొందరపాటు లేకుండా.. పొరపాట్లకు తావివ్వకుండా క్లాస్‌ ఆటతీరుతోనే ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఏదో వచ్చామా.. బ్యాటింగ్‌ చేశామా? అన్నట్లు కాకుండా క్రీజులో గడిపిన ప్రతి క్షణాన్ని, ఎదుర్కొన్న ప్రతి బంతినీ ఆస్వాదిస్తూ అభిమానులకు కనుల విందు చేశాడు. కళాత్మక విధ్వంసంతో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తూ నవ్వుతో శతక సంబరాలు చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ను ఎలా ఆరంభించి? ఎలా ముగించాలన్నది లోపరహితంగా చూపించాడు.

అతనికి ఇరుసులా మారి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమూ తెలుసు.. ఆఖర్లో సునామీలా చెలరేగి ప్రత్యర్థిని ముంచేయడమూ తెలుసు. గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 131 (110 బంతుల్లో) పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసిన అతను.. అనంతరం శ్రేయస్‌తో మూడో వికెట్‌కు 108 (71 బంతుల్లో) పరుగులు జత చేశాడు. అందులో శ్రేయస్‌ వాటా 38 (32 బంతుల్లో) మాత్రమే అంటే కోహ్లి బాదుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నెమ్మదిగా స్పందించిన పిచ్‌పై అతను మాత్రం వేగాన్ని తగ్గించలేదు. ఎలాంటి అలసట లేకుండా చివర్లో విధ్వంసానికి తెరలేపాడు.

చివర్లో ఊచకోత..
విరాట్‌ తొలి 50 పరుగులు చేసేందుకు 48 బంతులు తీసుకున్నాడు. క్రీజులో పూర్తిగా కుదురుకున్నాక, పరిస్థితులపై అవగాహన వచ్చాక బాదుడును మరోస్థాయికి తీసుకెళ్లాడు. 51 నుంచి 100 పరుగులు చేరుకోవడానికి 37 బంతులు ఆడాడు. శతకం తర్వాత శివతాండవమే చేశాడు. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి లంక బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. కేవలం 25 బంతుల్లోనే 101 నుంచి 166 పరుగులకు చేరుకున్నాడు. ఆ వ్యవధిలో 264 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. అతణ్ని ఆపలేక, ఔట్‌ చేయలేక బౌలర్లు నిస్సహాయులుగా మారిపోయారు. 40 ఓవర్ల వరకూ ఒక్క సిక్సరూ కొట్టని అతను.. చివరి 10 ఓవర్లలో ఏకంగా 8 సిక్సర్లు ఖాతాలో వేసుకున్నాడు.

ఓ వన్డే ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. కోహ్లి ఎంతో అలవోకగా పరుగులు సాధించాడు కాబట్టి పిచ్‌ నిర్జీవంగా ఉందనుకుంటే పొరపాటే. పిచ్‌ నుంచి అస్థిర బౌన్స్‌ వచ్చింది. కొన్నిసార్లు తక్కువ ఎత్తులో బంతి వచ్చింది. స్పిన్‌ తిరిగింది. ఛేదనలో సిరాజ్‌ సహా మన బౌలర్ల విజృంభణే అందుకు నిదర్శనం. కానీ కోహ్లి పరిస్థితులను అంచనా వేసి, బౌలర్ల లైన్‌ను ముందే పసిగట్టి బ్యాటింగ్‌ను సులువు చేశాడు. తనకు అచ్చొచ్చిన తేదీ (జనవరి 15)న మరో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇదే తేదీన 2019లో ఆస్ట్రేలియాపై వన్డేలో, 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టులో, 2017లో ఇంగ్లాండ్‌తో వన్డేలో కోహ్లి శతకాలు చేశాడు.

ఆ షాట్లు కూడా..
సుదీర్ఘ కాలం పాటు అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలంటే ఎప్పటికప్పుడూ ఆటతీరును మెరుగుపర్చుకోవాల్సిందే. ఇప్పుడు కోహ్లి అదే చేస్తున్నాడు. తనవి కాని షాట్లు ఆడడంలోనూ పట్టు సాధిస్తున్నాడు. సాధారణంగా కోహ్లి ఇన్నింగ్స్‌ అంటే ఎక్కువగా ఫోర్లే ఉంటాయి. ఈ మ్యాచ్‌లో సిక్సర్లతో వీరవిహారం చేశాడు. మాజీ కెప్టెన్‌ ధోని శైలిలో విరాట్‌ కొట్టిన హెలికాప్టర్‌ షాట్‌ అదిరింది. ధోని క్రీజులో ఉండి కొడితే.. కోహ్లి ముందుకు వచ్చి షాట్‌ ఆడాడు. రజిత బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతిని.. క్రీజు వదిలి ముందుకు వచ్చి శక్తిని కూడదీసుకుని మణికట్టును గొప్పగా వాడి లాంగాన్‌లో అతడు సిక్స్‌ కొట్టిన తీరును చూసితీరాల్సిందే.

బంతి గాల్లో తేలే సమయానికి మోకాలిపై కూర్చుని ఆ షాట్‌ను మరింత అందంగా మార్చాడు. కొద్దిసేపటికే సచిన్‌ తరహాలో కాస్త ఓవర్‌ పిచ్‌ అయిన బంతిని కొంచెం ముందుకు జరిగి లాంగాఫ్‌లో స్టాండ్స్‌లో పడేశాడు. ఇక తనదైన శైలిలో కవర్‌డ్రైవ్‌లతో, ఫ్లిక్‌ షాట్లతో అలరించాడు. అత్యధిక వన్డే శతకాల రికార్డులో సచిన్‌ (49)ను అందుకునేందుకు కోహ్లీకి కావాల్సింది మరో మూడు శతకాలే. 46 సెంచరీలు చేసేందుకు సచిన్‌కు 431 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. విరాట్‌ కేవలం 259 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనత సాధించాడు. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా అతడు ఈ ఏడాదిలోనే చరిత్ర సృష్టిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించి.. దశాబ్దం తర్వాత దేశానికి మరో కప్పు అందిస్తే అంతకుమించి ఆనందం ఇంకేముంటుంది!

5

వన్డేల్లో అత్యధిక పరుగుల బ్యాటర్ల జాబితాలో కోహ్లి స్థానం. ఈ మ్యాచ్‌తో అతను మహేల జయవర్ధనె (12,650)ను అధిగమించాడు. ప్రస్తుతం కోహ్లి 268 మ్యాచ్‌ల్లో 12,754 పరుగులతో ఉన్నాడు.

10

శ్రీలంకపై కోహ్లి సెంచరీలు. ఓ దేశంపై అత్యధిక వన్డే శతకాలు చేసిన ఆటగాడిగా సచిన్‌ (ఆస్ట్రేలియాపై 9) రికార్డును అతడు తిరగరాశాడు. కోహ్లి వెస్టిండీస్‌పైనా 9 సెంచరీలు చేశాడు.

21

స్వదేశంలో కోహ్లి వన్డే శతకాలు. సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ (20) ప్రపంచ రికార్డును అతను బద్దలుకొట్టాడు.

46

వన్డేల్లో కోహ్లి సెంచరీలు. అగ్రస్థానంలో ఉన్న సచిన్‌ (49)కు అతనికి మధ్య అంతరం మరో మూడు శతకాలే.

317

మూడో వన్డేలో భారత్‌ 317 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. వన్డే క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఓ జట్టు సాధించిన అత్యంత భారీ విజయమిది. న్యూజిలాండ్‌ రికార్డు (290 పరుగులు, 2008లో ఐర్లాండ్‌పై)ను టీమ్‌ఇండియా బద్దలు కొట్టింది.

ABOUT THE AUTHOR

...view details