India vs Sri Lanka: ఆధునిక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన విరాట్ కోహ్లీ తన కెరీర్లో గొప్ప మైలురాయి ముంగిట నిలిచాడు. అతడి కెరీర్లో వందో టెస్టుకు రంగం సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో మొదలయ్యే తొలి మ్యాచ్‌తోనే అతనీ మైలురాయిని అందుకోబోతున్నాడు. ఒకప్పటి స్థాయిలో పరుగుల వరద పారించలేకపోతున్న విరాట్.. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో పూర్వపు ఫామ్ అందుకుని, రెండేళ్లకు పైగా అంతర్జాతీయ శతకం కోసం సాగుతున్న నిరీక్షణకు తెరదించుతాడన్నది అభిమానుల ఆశ! ఇక విరాట్ నుంచి మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో జట్టును నడిపించబోతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటికే సారథిగా సత్తా చాటిన రోహిత్.. సుదీర్ఘ ఫార్మాట్లో ఎలాంటి ముద్ర వేస్తాడన్నది ఆసక్తికరం. 2012 తర్వాత పుజారా, రహానెల్లో ఒక్కరూ లేకుండా భారత్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే కావడం గమనార్హం. ఫామ్‌తో తంటాలు పడుతున్న ఈ సీనియర్లు.. ఈ సిరీస్‌కు జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, విహారి.. ఈ ముగ్గురిలో ఇద్దరు వారి స్థానాల్లో ఆడే అవకాశముంది. పుజారా, రహానెలను పక్కన పెట్టి భవిష్యత్ దిశగా కుర్రాళ్లకు అవకాశమిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం ఏమేర సఫలమవుతుందన్నది ఆసక్తికరం. సొంతగడ్డపై భారత్‌ను ఎదుర్కోవడం శ్రీలంకకు సవాల్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆ జట్టు టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే.
తుది జట్టు ఎలా?:ఈ మ్యాచ్‌కు తుది జట్టు విషయంలో కొత్త కెప్టెన్ రోహిత్‌కు కొంచెం తలనొప్పి తప్పేలా లేదు. ఓపెనింగ్‌లో రోహిత్‌కు తోడుగా మామూలుగా అయితే మయాంక్ రావాలి. కానీ అతనూ ఈ మధ్య నిలకడగా ఆడట్లేదు. మరి అతడికే ఇంకో ఛాన్స్ ఇస్తారా.. లేక కొత్త ఆటగాడు ప్రియాంక్ పాంచల్‌ను ఆడిస్తారా అన్నది చూడాలి. కోహ్లీ ఎప్పట్లాగే నాలుగో స్థానంలో వస్తాడు. ఆరో స్థానంలో పంత్ ఆడతాడు. 3, 5 స్థానాలకు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విహారిల మధ్య పోటీ ఉంది. ఎక్కువగా విదేశాల్లోనే అవకాశాలు దక్కించుకున్న విహారి.. సొంతగడ్డపైనా సత్తా చాటడానికి ఎదురు చూస్తున్నాడు. అయితే శ్రేయస్, గిల్లే తుది జట్టులో ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. గిల్ మూడో స్థానంలో, శ్రేయస్ అయిదులో ఆడొచ్చని అంచనా వేస్తున్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌కు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కూర్పుతో బరిలోకి దిగే అవకాశముంది. అశ్విన్, జడేజాలకు తోడు జయంత్ యాదవ్ లేదా కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులో చూడొచ్చు. ఇక బుమ్రాకు తోడుగా కొత్త బంతిని అందుకునేదెవరన్నది ఆసక్తికరం. రోహిత్ అనుభవజ్ఞుడైన షమిని ఎంచుకుంటాడో.. లేక గత మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన చేసిన సిరాజ్‌కు ఛాన్సిస్తాడో చూడాలి మరి. బ్యాటింగ్‌లో రోహిత్, కోహ్లి.. బౌలింగ్‌లో అశ్విన్, జడేజాలపై భారత్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
వాళ్లకూ ఉన్నారు:ఒకప్పటితో పోలిస్తే శ్రీలంక జట్టు ఇప్పుడు బలహీనమే అయినా.. ఆ జట్టులో కొందరు ప్రతిభావంతులున్నారు. ఆ జట్టు సొంతగడ్డపై వెస్టిండీస్‌పై సిరీస్‌ను 2-0తో నెగ్గి ఇక్కడికి వచ్చింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నెతో పాటు నిశాంక మంచి ఫామ్‌లో ఉన్నారు. అనుభవజ్ఞుడు మాథ్యూస్ ఫామ్ అందుకుంటే లంకకు పెద్ద బలమవుతాడు. బౌలర్లలో ఎంబుల్దేనియాపై భారత బ్యాట్స్‌మన్ ఓ కన్నేయాల్సిందే. అతను 13 మ్యాచ్‌ల్లో అయిదుసార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. మరో స్పిన్నర్ జయవిక్రమ ఆడిన మూడు టెస్టుల్లోనూ రాణించాడు. వీరికి తోడు ఆల్‌రౌండర్ ధనంజయతోనూ లంక స్పిన్ వేయించనుంది. పేస్ బాధ్యతలను లహిరు కుమార, సురంగ లక్మల్ పంచుకుంటారు. టీ20 సిరీస్‌లో భారత్ చేతిలో వైట్ వాష్‌కు గురైన లంక.. టెస్టుల్లో అయినా ఫలితం మార్చాలని పట్టుదలతో ఆడే అవకాశముంది.
తుది జట్లు (అంచనా)..
భారత్: రోహిత్ (కెప్టెన్), మయాంక్/ప్రియాంక్ పాంచల్, శుభ్‌మన్/విహారి, కోహ్లీ, శ్రేయస్, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్/జయంత్ యాదవ్, సిరాజ్/షమి, బుమ్రా.
శ్రీలంక: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), తిరిమానె, నిశాంక, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, చండిమాల్/అసలంక, డిక్వెలా (వికెట్ కీపర్), లక్మల్, ఎంబుల్దేనియా, జయవిక్రమ/విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార.