INDIA VS SRI LANKA: పింక్ బాల్ టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదిక జరిగిన ఈ టెస్టు మ్యాచును మూడు రోజుల్లోనే భారత్ ముగించింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. దీంతో 238 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. దిముత్ కరుణరత్నె శతకంతో (107: 174 బంతుల్లో 15×4), కుశాల్ మెండిస్ అర్ధ శతకంతో (54: 60 బంతుల్లో 8×4) రాణించారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు.. బుమ్రా మూడు.. అక్షర్ పటేల్.. రెండు రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
కరుణరత్నె ఒంటరి పోరాటం..
ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మూడో రోజు ఆటలో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె (107: 169 బంతుల్లో 15×4) పట్టుదల ప్రదర్శించాడు. నిలకడగా ఆడుతూ శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఏంజిలో మాథ్యూస్ (1), ధనంజయ డి సిల్వా (4), నిరోషన్ డి క్వెల్లా (12), చరిత్ అసలంక (5), లసిత్ ఎంబుల్దెనియా (2), సురంగ లక్మల్ (1), విశ్వ ఫెర్నాండో (2) పరుగులకే పరిమితమయ్యారు.
అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక 109 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాకు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం 303/9 స్కోరు వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక 208 పరుగులకు ఆలౌట్ కావడం వల్ల.. భారత్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఇదీ చూడండి:ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా శ్రేయస్ అయ్యర్